లాక్‌డౌన్‌లో ఇచ్చిన సడలింపులతో వేర్వేరు రాష్ట్రాల్లో ఇరుక్కుపోయిన వలస కూలీలు స్వస్థలాలకు తరలివెళ్తున్నారు. దీనికి భిన్నంగా పలు రాష్ట్రాల నుంచి కొందరు వలస కూలీలు తెలంగాణకు చేరుకుంటున్నారు. ప్రత్యేక రైలులో బిహార్‌లోని ఖగారియా నుంచి సుమారు 225 మంది కూలీలు హైదరాబాద్ లింగంపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు.
వలస కూలీలకు స్వాగతం
వలస కూలీలకు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, పౌరసఫరాల ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా అజయ్‌కుమార్, నోడల్ అధికారి సందీప్ సుల్తానియా తదితరులు స్వాగతం పలికారు. రైలులో వచ్చిన వారందరికీ ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆహార పొట్లాలు, తాగు నీరు, మాస్కులు, శానిటైజర్లు అందజేశారు.
పలు జిల్లాల రైస్ మిల్లులకు తరలింపు...
లింగంపల్లి రైల్వేస్టేషన్ చేరుకున్న బిహార్ వాసుల్లో 60 మందిని నల్గొండ, మిర్యాలగూడకు.... 120 మందిని కరీంనగర్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, సుల్తానాబాద్‌కు... 25 మందిని మంచిర్యాల, కాగజ్‌నగర్‌కు... 20 మందిని సిద్దిపేటకు ప్రత్యేక ఆర్టీసీ బస్సుల్లో తరలించారు. బస్సుల్లో కూలీలందరూ భౌతిక దూరం పాటించటమే కాకుండా మాస్కులు ధరించేలా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. వీరందరూ ఆయా జిల్లాలలోని రైస్ మిల్లుల్లో పనిచేయనున్నారు.
మరింత మంది కూలీలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని, విస్తృత ఉపాధి అవకాశాలు రాష్ట్రంలో ఉండడమే వలస కూలీల రాకకు కారణమని అధికారులు చెబుతున్నారు.