కల్యాణ వైభవాన్ని చాటిచెప్పేందుకు హైదరాబాద్ వనస్థలిపురంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం పాలకవర్గ సభ్యులు 'వివాహ వేడుక బొమ్మల కొలువు' పేరుతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీపావళి పర్వదినం పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ బొమ్మల కొలువుకు ఓ ప్రత్యేకత జోడించారు. పెళ్లి వైభవాన్ని చాటిచెప్పేలా బొమ్మలను రూపొందించారు. వివాహ వేడుకల్లో సంప్రదాయంగా జరిగే ప్రతి అంశాన్ని తయారు చేయించి ప్రదర్శించారు. నేటి తరం విస్మరిస్తున్న అనేక అంశాలు ఆవిష్కరించారు. వీటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
దిల్సుఖ్నగర్కు చెందిన జయకు పాతికేళ్ల నుంచి హస్తకళలో నైపుణ్యం ఉంది. ఆమె కుమార్తె వివాహం ఉండటంతో.. తన అభిరుచి మేరకు సుమారు 40 రోజులపాటు శ్రమించి వివాహ పద్దతులకు సంబంధించిన బొమ్మలను ఇంట్లో తయారుచేసి పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న వెంకటేశ్వర స్వామి ఆలయ పాలకవర్గ సభ్యులు.. ఆమెను సంప్రదించారు. వనస్థలిపురంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలిసారిగా 'వివాహ వేడుక బొమ్మల కొలువు'ను ఏర్పాటు చేశారు.
త్వరలో మా పాప పెళ్లి ఉంది. ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచనతో పెశ్లిలోని ఘట్టాలను తయారు చేశాను. వీటిని పెళ్లిలో ప్రదర్శన చేద్దామనుకున్నాం. తయారీ తర్వాత వాటిని ఇంట్లోనే పెట్టుకున్నాం. ఆలయ దేవస్థానం కోశాధికారి పాపారావు ఈ బొమ్మలను చూసి.. ఆలయంలో బొమ్మల కొలువు ఏర్పాటు చేద్దామన్నారు. వెంకటేశుని ఆశీర్వాదాలు కూడా ఉంటాయని బొమ్మల కొలువు పెట్టాము.
-జయ, బొమ్మల తయారీదారు
వివాహ బంధం గొప్పతనాన్ని భావితరాలకు అందించడంతో పాటు ఆలయానికి వచ్చే భక్తుల కోసం ప్రదర్శన ఏర్పాటు చేశామని ఆలయం పాలకవర్గ సభ్యులు దేవస్థానం ఛైర్మన్ లక్ష్మయ్య, దేవస్థానం కోశాధికారి పాపారావు వెల్లడించారు.
ఇదీ చూడండి: స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఇలా..