కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని ఇళ్ల స్థలాలకు కేటాయించడాన్ని నిరసిస్తూ ఏపీ కడప జిల్లాలో ఓ వ్యక్తి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. జిల్లాలోని మైదుకూరు మండలం జీవీసత్రంకు చెందిన పూర్వ అసైన్‌మెంట్ కమిటి సభ్యుడు అంకిరెడ్డిపల్లె నారాయణరెడ్డి... అరగుండు, అరమీసంతో నిరసన తెలిపారు. తనతోపాటు తన కుటుంబసభ్యులు ఉపాధి పొందేలా తనకు భూమి కేటాయించాలని కోరారు.
30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమి ఒక ఉద్యోగికి చెందనది కాగా... నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగికి భూమి కేటాయించడంపై ఏపీ లోకాయుక్తను ఆశ్రయించి తాను రద్దు చేయించానని నారాయణరెడ్డి పేర్కొన్నారు. జీవీసత్రం పరిధిలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నా... సాగు చేసుకుంటున్న భూమిని ఇళ్ల స్థలాలకు కేటాయించారంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల చర్యలను నిరసిస్తూ తాను అరగుండు, అరమీసంతో నిరసన చేపట్టినట్లు తెలిపారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తనకు, తన కుటుంబసభ్యులు ఉపాధికి భూమిని కేటాయించాలని కోరారు. ఈ విషయమై తహసీల్దారు ప్రేమంతకుమార్‌ను వివరణ కోరగా అనర్హత కలిగిన వ్యక్తికి భూమి కేటాయించగా... నారాయణరెడ్డి లోకాయుక్తను ఆశ్రయించి రద్దు చేయించిన విషయం వాస్తవమేనన్నారు. లోకాయుక్త ద్వారా ప్రభుత్వానికి కేటాయించిన భూమిన మొదటి ప్రాధాన్యతగా ఇళ్ల స్థలాలకు కేటాయించినట్లు తహసీల్దార్ వివరించారు. కొన్నేళ్లుగా నారాయణరెడ్డి కుటుంబసభ్యులు ఆ భూమిని సాగు చేసుకుంటున్నారనే విషయం మాత్రం అవాస్తవమన్నారు.
ఇదీచూడండి: కేరళలో ఘోర విమాన ప్రమాదం.. 19 మంది మృతి