లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక ప్రజలు తిండికి ఇబ్బంది పడకూడదని ప్రభుత్వం అర్హులందరికీ ఉచితంగా బియ్యం పంపిణీ చేసింది. ఉచిత బియ్యంతో పాటు.. ఖాతాలో రూ.1500 కూడా ఇస్తున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్, మే నెలల్లో రెండుసార్లు ఉచిత బియ్యం తీసుకున్న వారికి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రెండు నెలలకు కలిపి రూ.3వేలు ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. మొత్తం రెండు లక్షల ఎనిమిది వేల మంది అర్హులకు నగదు సాయం అందనున్నట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు 62 కోట్ల 40 లక్షల రూపాయలను ప్రజల ఖాతాల్లో వేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.
ఏప్రిల్ నెలలో 74.07 లక్షలు, మే నెలలో 74.35 కార్డుదారులకు బ్యాంకుల ద్వారా నేరుగా వారి ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. బ్యాంకు ఖాతాలు లేని లబ్ధిదారులకు ఏప్రిల్ నెలలో 5.21 లక్షల మంది, మే నెలలో 5.38 లక్షల మందికి పోస్టాఫీసుల ద్వారా 158.24 కోట్ల రూపాయలు అందజేసినట్టు శ్రీనివాస్ రెడ్డి వివరించారు. ఇప్పటి వరకు 81.49 లక్షల మంది కార్డుదారులకు 3 లక్షల 25వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని, 5187 మెట్రిక్ టన్నుల కందిపప్పు పంపిణీ చేశామని తెలిపారు.
ఇదీ చదవండి: ఆరు గాయాలుంటే ఒకటే అంటారేం..?:హైకోర్టు