హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) పరిధిలో సూక్ష, చిన్నతరహా, మధ్య తరహా పరిశ్రమలు 25 వేల నుంచి 30 వేల వరకు ఉన్నాయి. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పరిశ్రమలు అధికంగా ఉన్నాయి.
ఇక్కడి చిన్న పరిశ్రమల్లో అన్ని రకాల పరికరాలను ఉత్పత్తి చేస్తున్నారు. రక్షణ రంగానికి ఉపయోగపడే వస్తువులను తయారుచేసే పెద్ద పరిశ్రమలకు అనుబంధ పరికరాలను ఇక్కడి చిన్న పరిశ్రమల్లోనే తయారుచేసి పంపిస్తున్నారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, ప్లాస్టిక్ ఇలా అనేక రకాల వస్తువులను ఈ పరిశ్రమల్లో తయారు చేస్తున్నారు. ఇక్కడ దాదాపు ఏటా రూ.50 వేల కోట్ల టర్నోవర్‌తో ఉత్పత్తులు జరుగుతున్నాయి.
15 లక్షలమంది కార్మికులు పని చేస్తుండగా ఇందులో 5 లక్షలమంది వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలే. దాదాపు నెలన్నర పాటు లాక్‌డౌన్‌తో చిన్న పరిశ్రమలు కూడా మూతపడ్డాయి. పదిహేను రోజుల కిందట పరిశ్రమలను తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాదాపు అన్ని పరిశ్రమలను తెరిచినా 40 శాతం కూడా పని చేయడం లేదంటున్నారు.ఎలక్ట్రానిక్, ఫార్మా, వ్యవసాయ సంబంధ రంగాలతో పాటు వివిధ రంగాలకు సంబంధించి ఉప ఉత్పతులను తయారుచేసి భారీ పరిశ్రమలకు పంపిస్తుంటారు.
ప్రస్తుతం అవి పూర్తిగా ఉత్పత్తులను ప్రారంభించకపోవడంతో చిన్న పరిశ్రమల వారు తయారుచేసే అనుబంధ ఉత్పత్తుల అవసరం లేకుండా పోయింది. నేరుగా మార్కెట్లలో విక్రయించే అనేక రకాల వస్తువులూ ఇక్కడ తయారవుతున్నాయి. బహిరంగ మార్కెట్లు తెరుచుకున్నా వీటి కొనుగోళ్లు అంతంత మాత్రంగా ఉండటం కూడా చిన్నపరిశ్రమల వస్తువుల ఉత్పత్తికి ఇబ్బందిగా మారింది. ఇదే సమయంలో.. కొద్ది రోజులుగా మూడు లక్షలమందికిపైగా కూలీలు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు.
కరోనా చిన్న పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపించింది. ఆంక్షలు తొలగినా వివిధ కారణాలతో చిన్న పరిశ్రమలన్నీ పూర్తిస్థాయిలో వస్తువుల ఉత్పత్తులను మొదలు పెట్టలేని పరిస్థితి. మరో నాలుగైదు నెలలు ఇలాగే ఉంటుంది. వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవడంతో కొన్ని కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయి. భారీ పరిశ్రమల్లో పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభం కాకపోవడంతో ఈ ప్రభావం చిన్న పరిశ్రమలపై పడుతోంది. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో మాకు పెద్దగా లాభం లేదు.
- టి.సుధీర్‌రెడ్డి, తెలంగాణ పరిశ్రమల సమాఖ్య ప్రతినిధి