Shilpa layout flyover inauguration : ఐటీ కారిడార్‌ను బాహ్యవలయ రహదారి (ఓఆర్‌ఆర్)తో అనుసంధానం చేస్తూ నిర్మించిన శిల్పా లేఅవుట్ మొదటి దశ పైవంతెన ప్రారంభానికి సిద్ధమైంది. ఐకియా మాల్ వెనక మొదలయ్యే ఈ పై వంతెన 30 అంతస్తుల ఎత్తైన భవనాల మధ్య నుంచి సాగిపోతూ విశాలమైన ఓఆర్‌ఆర్‌పైకి చేరుతుంది. బహుళ అంతస్తుల మధ్య వంపులు తిరుగుతూ.. రెండు అంతస్తుల్లో రూపుదిద్దుకున్న ఈ వంతెనకు అనేక ప్రత్యేకతలున్నాయని, ఆకాశం నుంచి చూస్తే శిల్పంలా కనిపిస్తుందని ఇంజినీర్లు చెబుతున్నారు.
ఇనార్బిట్ మాల్, రహేజా మైండ్‌స్పేస్ కూడలి, బయో డైవర్సిటీ కూడలి మధ్య సుమారు 1.5 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం అవుతున్న హైదరాబాద్ నాలెడ్జ్ సెంటర్(హెచ్‌కేసీ) దృష్ట్యా రూపొందించిన ప్రాజెక్టుల్లో శిల్పా లేఅవుట్ పైవంతెన మూడో ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.250కోట్లు ఖర్చు అయ్యింది. శిల్పా లేఅవుట్ వంతెన పొడవు 956 మీటర్లు కాగా, వెడల్పు 16 మీటర్లుగా ఉండి నాలుగు వరసల్లో రోడ్డు ఉంది.
డిసెంబరు నెలాఖరులో కొండాపూర్ కూడలి పైవంతెన అందుబాటులోకి రానుంది. ఓఆర్‌ఆర్ నుంచి గచ్చిబౌలి పైవంతెన మీదుగా బొటానికల్ గార్డెన్ రోడ్డుపైకి నిర్మిస్తున్న శిల్పా లేఅవుట్ రెండోదశ ప్రాజెక్టు డిసెంబరు 2023 నాటికి పూర్తవుతుందని అంచనా. శిల్పా లేఅవుట్ మొదటి దశ పై వంతెనను శుక్రవారం పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు జీహెచ్‌ఎంసీ ప్రకటించింది.
ఇవీ చదవండి: