Komatireddy Venkat Reddy letter to CM : డీఎస్సీ నోటిఫికేషన్ వారం రోజుల్లో ప్రకటన చేయాలని.. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఆ ఉత్తరంలో డీఎస్సీ అభ్యర్థుల అవస్థలు, ఆలస్యం వల్ల కలిగే ఇబ్బందుల గురించి వివరించారు. తొమ్మిదేళ్ల క్రితం ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామని.. అలాంటి రాష్ట్రంలో ప్రస్తుతం ఏం జరుగుతోందని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదం స్ఫూర్తిగా సాగిన ఉద్యమం ఆశలు ఎక్కడా నెరవేరలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టిన ప్రాజెక్టుల్లో ఎటువంటి మార్పు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని.. అప్పుల కుప్పగా చేశారని మండిపడ్డారు.
Problems of DSC Aspirants in Telangana : అనవసర ఆర్భాటాలకు పోయి.. ప్రజాధనం వృథా చేస్తున్నారని మండిపడ్డారు. తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణలో ఇచ్చిన నోటిఫికేషన్లు, భర్తీ చేసిన ఉద్యోగాలపై శ్వేత పత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా టీచర్ పోస్టుల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. ఇప్పటికే డీఎస్సీ అభ్యర్థులు పలుమార్లు టెట్ రాసి సిద్ధంగా ఉన్నారని.. నోటిఫికేషన్ కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారని తెలిపారు.
Telangana TET 2023 : మరోసారి 'టెట్' నిర్వహణ.. మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం
Telangana TET Full Details : రాష్ట్రం ఏర్పడిన తరవాత తొలి టెట్ 2016 మే 22న జరిగిందని పేర్కొన్నారు. అందులో పేపర్-1కు 88,158 మంది హాజరు కాగా.. 48,278 మంది పాసయ్యారని.. పేపర్-2ను 2,51,924 మంది రాయగా 63,079 మంది ఉత్తీర్ణులయ్యారని వివరించారు. రెండో టెట్ 2017 జులై 23న నిర్వహించారని అన్నారు. అందులో పేపర్-1ను 98,848 మంది రాయగా.. 56,708 మంది పాసయ్యారని.. పేపర్-2కు 2,30,932 మంది హాజరుకాగా.. 45,045 మంది ఉత్తీర్ణులయ్యారని గుర్తు చేశారు. మూడో టెట్ 2020 జూన్ 12న జరిగిందని పేర్కొన్నారు. పేపర్-1కు 3.18 లక్షల మంది హాజరయ్యారని.. అందులో 1,04,578 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. పేపర్-2ను 2,50,897 మంది రాయగా.. 1,24,535 మంది పాసయ్యారని వెల్లడించారు.
NO | పరీక్ష జరిగిన సంవత్సరం | పేపర్ 1 | ఉత్తీర్ణులైిన వారు | పేపర్ 2 | ఉత్తీర్ణులైిన వారు |
1 | 2016 మే 22 | 88,158 | 48,278 | 2,51,924 | 63,079 |
2 | 2017 జులై 23 | 98,848 | 56,708 | 2,30,932 | 45,045 |
3 | 2020 జూన్ 12 | 3.18 లక్షలు | 1,04,578 | 2,50,897 | 1,24,535 |
వారందరూ నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు : రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 12,500 మంది డీఎడ్, మరో 15,000 మంది బీఎడ్ కోర్సు పూర్తి చేస్తున్నారని.. వారంతా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వేలల్లో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. దీంతో పాటు రిటైర్డ్ అవుతున్న వారి సంఖ్యా పెరుగుతోందని అన్నారు. వారి స్థానాల్లో కొత్త ఉపాధ్యాయుల నియామకం వెంటనే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి :