తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతోంది. ఈ నెల 25న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు ఆలయ శుద్ధి చేస్తున్నారు. వేకువజామున సుప్రభాతం, అర్చన సేవల అనంతరం శ్రీవారి మూలవిరాట్టుపై పట్టు వస్త్రంతో కప్పివేశారు. నాముకోపు, శ్రీ చుర్ణం, కస్తూరి పనువు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కిచిలీగడ్డ మొదలైన సుగంధ ద్రవ్యాలు కలగలిసిన పవిత్ర జలంతో ఆలయ శుద్ధి కార్యక్రమం మొదలు పెట్టారు.
ఆనందనిలయం, బంగారువాకిలి శ్రీవారి ఆలయంలోని ఉపదేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పూజాసామాగ్రి తదితర అన్ని వస్తువులను శుభ్రపరుస్తున్నారు. వేకువజామున మొదలైన ఈ కార్యక్రమం 11 గంటల వరకు పూర్తవుతుందని తితిదే సిబ్బంది తెలిపారు. అనంతరం స్వామివారికి కప్పిన వస్త్రాన్ని తొలగిస్తారు. శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులకు.. దర్శనానికి అనుమతిస్తారని అర్చకులు చెప్పారు.
"కోయిల్ ఆళ్వార్ శుద్ధికార్యక్రమం ఏడాదిలో నాలుగు సార్లు జరుగుతుంది. ఉగాది, ఆని వారం ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశికి పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారం రోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహిస్తాం" -ధర్మారెడ్డి, తితిదే అదనపు ఈవో
- ఇదీ చూడండి: చలిని లెక్కచేయకుండా.. సాగుతున్న రైతన్న పోరాటం