రాష్ట్రంలో ఐదేళ్లలో మద్యం అమ్మకాలు రెట్టింపయ్యాయని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. రూ.10 వేల కోట్లుగా ఉన్న ఆదాయం ప్రస్తుతం రూ.20 వేల కోట్లకు పెరిగిందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే మద్యం నియంత్రణకు కార్యాచరణ తయారుచేయాలని కోరారు. నియంత్రణకు విశ్రాంత న్యాయమూర్తితో కమిషన్ వేయాలని కోరారు. బెల్టు షాపులను రద్దు చేయాలని, వాటి పర్మిట్లు ఎత్తివేయాలని, మద్యం దుకాణాల వేళలను కుదించాలని కోదండరాం డిమాండ్ చేశారు.
నదుల అనుసంధానం వద్దు..
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోనేలా ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోదండరాం డిమాండ్ చేశారు. నదుల అనుసంధానం పేరిట గోదావరి మిగులు జలాలను కృష్ణాకు తరలిస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నదుల అనుసంధానం ప్రక్రియ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. గోదావరి మిగులు జలాలను తెలంగాణ అవసరాల కోసం వినియోగించాలని కోరారు. కృష్ణానది నీటిలో న్యాయపరమైన వాటాను దక్కించుకోనేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇవీచూడండి: సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్‌కు కొత్త కళ