కరోనా వైరస్ ప్రజల జీవన విధానంలో అనేక మార్పులు తీసుకొచ్చింది. దాదాపుగా ఇంటి తిండికి అలవాటు పడిన ప్రజలు... కావలసిన వంటలను ఇంట్లోనే తయారు చేసుకుంటున్నారు. బయట లభించే పదార్థాల వల్ల... వైరస్ వ్యాప్తి చెందుతుందన్న భయం ఇందుకు ప్రధాన కారణమైంది.
ప్రధానంగా ఏటా వేసవికాలంలో వంటనూనెల వినియోగం తగ్గుతుంది. ఈసారి పరిస్థితి భిన్నంగా మారింది. గృహాల్లో వంట నూనెల వినియోగం గతంలో ఎన్నడూలేని విధంగా... పెరిగినట్లు రెండు నెలల నూనెల అమ్మకాల ద్వారా తేలింది. అదే సమయంలో రెస్టారెంట్లు, హోటళ్లు తదితర వాణిజ్య కార్యకలాపాల్లో వినియోగించే నూనెల వినియోగం భారీగా తగ్గింది. బిస్కెట్లు, బ్రెడ్లు లాంటి పరిశ్రమ కార్యకలాపాల్లో వినియోగంలో మాత్రం.. ఎలాంటి మార్పు లేదని నూనెల ఉత్పత్తి దారులు స్పష్టంచేశారు.
గృహాల్లో వంటనూనెల వినియోగం ఏప్రిల్‌లో 30 శాతం పెరిగిందని ఆ పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. వంట నూనెలకు సంబంధించి... డిమాండ్ పరంగా కూడా ఈ సంవత్సరం మార్పులు వస్తాయని వారు అంటున్నారు.
వంట నూనెల కోసం మనదేశం ప్రధానంగా దిగుమతులపైనే అధారపడుతోంది. పామాయిల్, పొద్దుతిరుగుడు పువ్వు, సోయాబీన్, వేరుశనగ ఇలా అన్ని రకాల వంట నూనెలు కలిపి.. 21 మిలియన్ టన్నుల వరకు డిమాండ్ ఉంది. లాక్‌డౌన్ సమయంలో దిగుమతులకు ఎలాంటి అంతరాయం కలగలేదు. అంతే కాకుండా కంపెనీల వద్ద దాదాపు మూడు నెలలకు సరిపడా నిల్వలున్నాయి. ఫలితంగా వంట నూనెల సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడలేదు.
ఇదీ చూడండి: భారత 'జ్యోతి'కి ఇవాంకా ట్రంప్ సలాం!