ఖైదీలకు ఔషధాలు, పుస్తకాలతో పాటు కుటుంబీకులు రాసిన లేఖలను అందించాలనే డిమాండ్‌తో జైలులోనే ఆమరణ నిరాహార దీక్ష చేయాలని ప్రొ.జీఎన్ సాయిబాబా నిర్ణయించారు. దీనిపై ‘కమిటీ ఫర్ ది డిఫెన్స్ అండ్ రిలీజ్ ఆఫ్ డా.జీఎన్ సాయిబాబా’ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 21 నుంచి ఆమరణ దీక్షకు సిద్ధమని పేర్కొంటూ సాయిబాబా నాగ్‌పుర్ కేంద్ర కారాగారం అధికారులకు నోటీసు ఇచ్చినట్లు కమిటీ ఛైర్మన్ ప్రొ.జి.హరగోపాల్, కన్వీనర్ కె.రవిచందర్ తెలిపారు.
90శాతం అంగవైకల్యంతో బాధపడుతూ జైలు జీవితం గడుపుతున్న సాయిబాబాకు సరైన వైద్యసాయం అందించకపోవడమే కాకుండా ఔషధాలివ్వడంలోనూ జాప్యం చేస్తున్నారన్నారు. గత ఆగస్టులో తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకూ పెరోల్ మంజూరు చేయకపోవడం బాధాకరమన్నారు.
ఇదీ చూడండి: తాడ్వాయిలో ఎదురుకాల్పులు... ఇద్దరు మావోయిస్టులు మృతి