ఆదాయ పన్నుశాఖలో పరోక్ష పన్నుల అసెస్‌మెంట్ విధానం అమలులోకి వచ్చింది. ఇకపై ఆదాయ పన్ను చెల్లింపుదారులు కార్యాలయాలకు వచ్చి అధికారులతో నేరుగా కలుసుకోవాల్సిన అవసరంలేదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కావాల్సిన పత్రాలు దాఖలు చేసే సులభతర విధానాన్ని అధికారులు అమలు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో ప్రస్తుతం ఒక ప్రాంతీయ ఈ-అసెస్‌మెంట్ కేంద్రం ఉందన్నారు. వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ ఈ విధానంతో పన్ను చెల్లింపుదారులకు అనేక ప్రయోజనాలు కలుగనున్నాయని ఆదాయపన్ను శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. దీని ద్వారా వేగంగా న్యాయంగా పన్ను లెక్కింపు అనవసరమైన భారీ జరిమానాల విధింపులు లేకుండా చూడడమే దీని లక్ష్యమన్నారు.
ఈ పరోక్ష అసెస్ మెంట్ పథకాన్ని 2019 సెప్టెంబర్ 12న నోటిఫై చేసి 2019 అక్టోబర్ 7న నమూనా ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. దేశ వ్యాప్తంగా పరోక్ష అసెస్ మెంట్ పథకం కింద కేసులు 58319 ఉన్నాయన్నారు. 8701 కేసులకు ఎలాంటి మార్పులు చేయకుండానే ఖరారు చేశారు. 296 కేసుల విషయంలో మాత్రం అదనపు చేర్పులు ప్రతిపాదించగా సమీక్షలో ఉన్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ ఈ -అసెస్‌మెంట్ కేంద్రానికి పంపే కేసులను ఇద్దరు ప్రిన్సిల్ ఇన్‌కామ్ ట్యాక్స్ కమిషనర్లు పరిశీలిస్తున్నారని ఆదాయపన్నుశాఖ వివరించింది.