రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఇండియన్ సొసైటీ ఆఫ్ ఆయిల్‌సీడ్స్ రీసెర్చ్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్‌సీడ్స్ రీసెర్చ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సెమినార్‌కు డీజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా... ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థల సంచాలకులు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల పూర్వ ఉపకులపతులు, పలు విభాగాల అధిపతులు, నూనెగింజల పంటల శాస్త్రవేత్తలు 500 మందికి పైగా ఈ సదస్సుకు హాజరయ్యారు.
"పౌష్టికాహార భద్రత - నూనెగింజల పంటల సాగులో ఉత్పత్తి, ఉత్పాదకత పెంపు, లాభదాయకంగా తీర్చిదిద్దడం, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు"పై శాస్త్రవేత్తలు విస్తృతంగా చర్చిస్తున్నారు. ఏటా మలేషియా, ఇండోనేషయా ఇతర దేశాల నుంచి పామాయిల్ సహా ఇతర ముడి నూనెలు, వంటనూనెలు దిగుమతి చేసుకోవడానికి 70 వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న దృష్ట్యా... వేరుశనగ, పామాయిల్, నువ్వులు, కుసుమ, ఆముదం, సోయాబీన్ తదితర పంటల సాగు విస్తీర్ణం పెంపొందించుకోవాల్సి ఉంటుందని డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర అన్నారు.
రాబోయే ఐదేళ్లకాలంలో నూనెగింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడం ఇతర దేశాల నుంచి దిగుమతులకు పూర్తి స్వస్థి చెప్పాలంటే వాతావరణ మార్పులకు అనుగుణంగా నాణ్యమైన అధిక దిగుబడి ఇచ్చే సంకర జాతి విత్తనాలు, విస్తరణ సేవలు, పరిశోధన ఫలితాలు, డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం రైతులకు చేరవేయాలని శాస్త్రవేత్తలకు దిశానిర్దేశం చేశారు.
ఇవీ చూడండి: 'ఐదుగురికి ఉరిశిక్ష వేయడం అభినందనీయం'