అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ పోలీస్ ఉన్నతాధికారులతో కార్యాలయంలో సమావేశమయ్యారు. డీజీపీ మహేందర్ రెడ్డి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తతో పాటు ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శాసనసభ సందర్భంగా తీసుకున్న భద్రతా చర్యలను పోలీస్ ఉన్నతాధికారులు హోం మంత్రికి వివరించారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాంతి భద్రతలు కాపాడటంలో పోలీసు అధికారులు, సిబ్బంది చేసిన కృషిని, చేపట్టిన వినూత్న పథకాలను పోలీసు అధికారులు హోంమంత్రికి వివరించారు. హైదరాబాద్ సురక్షిత నగరంగా గుర్తింపు పొందడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలను సమర్థంగా కాపాడుతున్నామని మంత్రికి వివరించారు.
ఎన్సీఆర్ బీ డేటా ప్రకారం దాదాపు 65 శాతం పైగా కేసులు సీసీటీవీల సహకారంతో ఛేదించడం, షీ టీమ్ ల ఏర్పాటు, మహిళా భద్రతా విభాగం ఏర్పాటు చేయడం, ఎన్నో సంచలనాత్మక కేసులోనూ ఛేదించి నిందితులను పట్టుకోవడంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే ముందున్నారని పోలీస్ ఉన్నతాధికారులు హోంమంత్రికి తెలిపారు.