కాలుష్య నియంత్రణ అప్పీల్ అథారిటీని రెండు వారాల్లో ఏర్పాటు చేయాలని హైకోర్టు (Highcourt) మరోసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆదేశాలు అమలు కాకపోతే తదుపరి విచారణకు పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ విచారణకు హాజరై.. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు చేపట్టరాదో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.
రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ అప్పీల్ అథారిటీ ఏర్పాటు చేయాలని దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. మరోవారం రోజులు గడువు కావాలని ఏజీ బీఎస్ ప్రసాద్ కోరడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి పేరును సిఫార్సు చేసినప్పటికీ.. గౌరవ వేతనం ఖరారు చేసి నియామకం చేపట్టేందుకు జాప్యం ఎందుకని ప్రశ్నించింది. ప్రభుత్వం చేస్తున్న జాప్యం వల్ల అంతిమంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వ్యాఖ్యానించింది. రెండువారాల్లో దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని విచారణను జూన్ 30కి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: తెలంగాణలో కొత్తగా 1,489 కరోనా కేసులు, 11 మరణాలు