Tribal Woman Third Degree Incident in LB Nagar Updates : ఎల్బీనగర్లో మహిళపై పోలీసుల దాడి ఘటనపై.. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు నివేదికను అందించాలని.. సీసీటీవీ దృశ్యాలను సైతం సమర్పించాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి హోంశాఖ కార్యదర్శి, డీజీపీ, రాచకొండ సీపీ, ఎల్బీనగర్ డీసీపీ, వనస్థలిపురం ఏసీపీ, ఎల్బీనగర్ సీఐలకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఈ దాడి ఘటనపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద.. ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే దీనిని సుమోటోగా విచారణకు స్వీకరించారు. ఎల్బీనగర్ చౌరస్తాలో గిరిజన మహిళపై ఆగస్టు 16 తెల్లవారుజామున పోలీసులు దాడికి పాల్పడ్డారు. చౌరస్తాలో న్యూసెన్స్ చేస్తున్నారని ముగ్గురు మహిళలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఓ మహిళను లాఠీతో కొట్టారు. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. బాధితురాలి కుటుంబ సభ్యుల ద్వారా ఈ విషయం బయటికి వచ్చింది. దీంతో స్పందించిన సీపీ చౌహాన్.. ఘటనకు బాధ్యుల్ని చేస్తూ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయడంతో పాటు.. ఎస్ఐను హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు.
CP Chauhan on LB Nagar Police Station Issue : కారణమేదైనా ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో బాధితురాలిని కొట్టడం తప్పేనని.. ఇలాంటి చర్యల్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించబోమని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ ఘటనపై డీసీపీతో విచారణ జరిపిస్తున్నామని చెప్పారు. బాధితురాలిని అదుపులోకి తీసుకోవడం, పోలీస్‌స్టేషన్ జరిగినదంతా రికార్డ్ అయిందని డీఎస్ చౌహాన్ తెలిపారు.
మహిళను నిర్దిష్ట కారణంతోనే పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారని డీఎస్ చౌహాన్ తెలిపారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి.. ఎస్ఐని బదిలీ చేశామని పేర్కొన్నారు. ఈ నివేదికను మహిళా కమిషన్‌కు పంపామని.. హైకోర్టుకు సీసీ ఫుటేజీ, జనరల్ డైరీ(జీడీ) ఎంట్రీ, విచారణ నివేదిక సహా పూర్తి వివరాలతో సమర్పిస్తామని వివరించారు. పోలీసులు బాధితురాలి నుంచి డబ్బు తీసుకున్నారన్న ఆరోపణ నిర్థారణ కాలేదని చెప్పారు. దీనిపై విచారణ జరుగుతోందని డీఎస్ చౌహాన్ స్పష్టం చేశారు.
అసలేం జరిగిదంటే : మీర్‌పేట నందిహిల్స్కి చెందిన వరలక్ష్మి.. ఆగస్టు 15న రాత్రి ఇంటికి వెళ్లేందుకు మరో ఇద్దరితో కలసి ఎల్బీనగర్ కూడలి వద్ద ఉంది. ఆ సమయంలో అక్కడ గొడవ జరుగుతుందని పోలీసులకు సమాచారం వచ్చింది. గస్తీ కాస్తున్న కానిస్టేబుళ్లు అక్కడికి చేరుకుని.. వరలక్ష్మి సహా మరో ఇద్దరు మహిళలను స్టేషన్‌కి (LB Nagar Police Station) తీసుకెళ్లారు. వారిపై 290 సెక్షన్ ప్రకారం.. పోలీసులు న్యూసెన్స్ కేసు నమోదు చేశారు. స్టేషన్లో పోలీసులు తనను తీవ్రంగా లాఠీలతో కొట్టారని.. సెల్‌ఫోన్ లాక్కున్నారని బాధితురాలు ఆరోపించింది.