దేవరయాంజల్ భూములపై విచారణ చేసే స్వేచ్ఛ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దేవరయాంజల్ భూముల సర్వేపై ఐఏఎస్‌ల కమిటీ ఏర్పాటు జీవోను కొట్టివేయాలని కోరుతూ.. సదాకేశవరెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. జీవో 1014 అమలు నిలిపివేసేందుకు నిరాకరించింది.
ఆలయ భూముల గుర్తింపునకు విచారణ చేస్తే ఇబ్బందేమిటని ప్రశ్నించింది. ప్రభుత్వ, ఆలయ భూములను గుర్తించకూడదా? అని పిటిషనర్‌ను ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. కబ్జాదారులను ఆక్రమణలు చేసుకోనీయాలా అన్న హైకోర్టు.. విచారణ జరిపి నివేదిక ఇవ్వడం కమిటీ బాధ్యతని పేర్కొంది. నోటీసులు ఇవ్వకుండా భూముల్లోకి వస్తున్నారని పిటిషనర్ వాదించగా.. దేవరయాంజల్ భూములపై విచారణ జరిపే స్వేచ్చ కమిటీకి ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. భూముల్లోకి వెళ్లే ముందు పిటిషనర్లకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. పిటిషనర్లపై వ్యతిరేక చర్యలు తీసుకుంటే, ముందస్తు నోటీసు ఇవ్వాలని సూచించింది.
కమిటీకి అవసరమైన దస్త్రాలు, సమాచారం ఇవ్వాలని పిటిషనర్లను హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్లు విచారణకు సహకరించకపోతే అధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చన్న హైకోర్టు.. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.