Harish rao on Hospitals: ఆరోగ్య తెలంగాణ సాకారం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. వైద్యారోగ్య శాఖ, ఆర్ అండ్ బీ అధికారులతో హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. కొత్త ఆస్పత్రులు, వైద్య కళాశాలల నమూనాలు, వాటి నిర్మాణ పనులపై అధికారులతో చర్చించారు. వరంగల్‌లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాన్ని చేపట్టబోతున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో నిర్మాణాలు మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న వరంగల్ ఆస్పత్రికి రూ.1,100 కోట్లతో పరిపాలన అనుమతులు జారీ చేసినందున నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి పూర్తయితే వరంగల్... రాష్ట్రానికే మెడికల్ హబ్‌గా మారుతుందని అన్నారు
గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్యం
medical colleges: గ్రామీణ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలన్న లక్ష్యంతో జిల్లాకు ఒక వైద్యకళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. కళాశాలలను త్వరగా పూర్తి చేస్తే మారుమూల ప్రజలకు సైతం నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని 8 వైద్య కళాశాలల నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విస్తరించుకునేలా నిర్మాణాలు ఉండాలని సూచించారు. ఆధునిక పద్ధతులతో, మెరుగైన వైద్య సదుపాయాలు ఉండేలా నమూనాలు ఉండాలని... నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని హరీశ్ రావు స్పష్టం చేశారు.
త్వరలో టిమ్స్ ఆస్పత్రులకు సీఎం శంకుస్థాపన
TIMS in Hyderabad: హైదరాబాద్‌లో త్వరలోనే 4 టిమ్స్ ఆస్పత్రులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు. దిల్లీలోని ఎయిమ్స్ తరహాలో వైద్యసేవలు అందేలా నగరంలోని నాలుగు మూలల్లో టిమ్స్ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఒక్కో ఆస్పత్రిలో వెయ్యి పడకల చొప్పున గచ్చిబౌలి, సనత్ నగర్, ఎల్బీనగర్, అల్వాల్‌లో టిమ్స్ ఆస్పత్రుల ఏర్పాటుకు సన్నాహకాలు వేగంగా సాగుతున్నాయని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఆయా ప్రాంతాల్లో విమానాశ్రయాలు, కంటోన్మెంట్ బోర్డు, ఇతర సంస్థల నిబంధనలు కూడా పరిగణలోకి తీసుకుని నమూనాలు తయారు చేయాలని అధికారులను కోరారు.
ప్రత్యేకంగా సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు
sewerage treatment plants:రాష్ట్రంలోని 20 ఆస్పత్రులకు ప్రత్యేకంగా సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు హరీశ్ రావు తెలిపారు. గాంధీ, ఉస్మానియా, ఎంజీఎం, టిమ్స్, నీలోఫర్ సహా ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య నిర్వహణలో రాజీ పడకుండా వ్యర్థ జలాలను శుద్ధి చేసి బయటకు వదలాలని సూచించారు. సుమారు 59.25 కోట్ల రూపాయలతో ప్లాంట్ల నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. వెంటనే ప్లాంట్ల ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలన్న మంత్రి నాణ్యతలో రాజీ పడవద్దని స్పష్టం చేశారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
పటాన్‌చెరులో సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి: హరీశ్‌రావు
Super Specialty Hospitals: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలో కార్మికులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందేలా కొత్త ఆస్పత్రి నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు త్వరగా పనులు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రూ.150 కోట్ల వ్యయంతో 200 పడకల ఆస్పత్రి నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధం చేసి త్వరగా పనులు ప్రారంభించాలని చెప్పారు. పారిశ్రామిక ప్రాంతంలో వచ్చే వ్యాధులను గుర్తించి అందుకు అవసరమైన వైద్య విభాగాలు, నిపుణులను ఏర్పాటు చేయాలని హరీశ్ రావు అధికారులకు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: