Governor Tamilisai on TSRTC bill : రోడ్డు రవాణా సంస్థ (RTC) రాష్ట్ర ప్రభుత్వంలో విలీనంపై ప్రతిష్టంభనకు తెరపడేలా లేదు. ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ లేవనెత్తిన అంశాలపై.. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరణ ఇచ్చినా మరికొన్ని సందేహాలపై వివరణ ఇవ్వాలంటూ గవర్నర్ తమిళిసై తాజాగా సూచించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతకుముందు పది మంది కార్మిక సంఘాల బృందంతో సైతం గవర్నర్ అనేక అంశాలను లేవనెత్తారు. నేతలకు తాను ఎందుకు బిల్లును తిరిగి పంపారో గవర్నర్ తమిళిసౌ సౌందరరాజన్ వివరణ ఇచ్చారు.
తాను కార్మిక సంఘాల శ్రేయస్సు కోసమే బిల్లును తిప్పి పంపినట్లు తెలిపారు. అది ఆర్థిక పరమైన బిల్లు కావడంతో కార్మికులకు నష్టం కలగకూడదనే ఉద్దేశంతోనే పంపినట్లు తెలియజేశారు. తన సందేహాలను ప్రభుత్వం నివృత్తి చేయగానే బిల్లును ఆమోదిస్తానని హామీ ఇచ్చారు. మొదటి సారి గవర్నర్ లేవనెత్తిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. రాజ్‌భవన్‌కు వివరణతో కూడిన కాపీని పంపింది. ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలోకి తీసుకుంటున్నామని.. ఆర్టీసీ కార్పొరేషన్ సంస్థ యధావిధిగానే కొనసాగుతుందని స్పష్టం చేసింది.
BJP Supports TSRTC Bill : "ఆర్టీసీ బిల్లును బీజేపీ స్వాగతిస్తోంది.. మాపై అసత్య ప్రచారాలొద్దు"
కార్పొరేషన్ యథాతథంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడించింది. కేంద్ర వాటా, గ్రాంట్లు, రుణాల వివరాలు అవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది. ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణే ఆర్టీసీ విలీన బిల్లు ప్రధాన ఉద్దేశమని వివరించింది. ఆర్టీసీ కార్మికులకు గత కార్పొరేషన్ కంటే మెరుగైన జీతాలు అందుతాయని తెలిపింది. ప్రభుత్వంలో విలీనం తర్వాత రూపొందించే గైడ్ లైన్స్‌లో అన్ని అంశాలు ఉంటాయని వెల్లడించింది.
Governor Questions on RTC Bill : కేంద్ర ప్రభుత్వ వాటా, 9వ షెడ్యూల్ సమస్యలను ఏపీ ప్రభుత్వం మాదిరిగానే పరిష్కరిస్తామని గవర్నర్‌కు పంపిన వివరణలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అన్ని అంశాలపై వివరణ ఇచ్చామని.. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం గవర్నర్ తమిళిసైని కోరింది. వరుసగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. ఆర్టీసీ బిల్లుపై సందేహాలు లేవనెత్తడంతో అటు ఆర్టీసీ కార్మిక సంఘాలలో ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉత్కంఠ నెలకొంది.
RTC employees Protest : బిల్లును గవర్నర్ పెండింగ్‌లో ఉంచడాన్ని నిరసిస్తూ.. ఆర్టీసీ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉదయం 6 నుంచి 8 గంటల వరకు విధులకు దూరంగా ఉన్నారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్, చెంగిచర్ల, హయత్‌నగర్, షాద్‌నగర్, ఫలక్‌నుమా, ఫరూక్నగర్, హకీంపేట, లింగపల్లి హెచ్‌సీయూ, కూకట్‌పల్లి తదితర డిపోల్లో కార్మికులు నిరసన గళం వినిపించారు. గవర్నర్ తమ సమస్యల పట్ల వెంటనే స్పందించి.. ఆర్టీసీ బిల్లును ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. బస్సులన్నీ డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ఉదయాన్నే విద్యాసంస్థలకు, కార్యాలయాలకు వెళ్లే వారు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది.