Swapnalok Complex Fire Accident In Secunderabad: సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్ఘటనలో ప్రాణనష్టం జరగటంతో పాటు పలువురు గాయపడటంపై సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్సఅందించాలని.. అధికారులను సీఎం ఆదేశించారు.
గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాలను.. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు.. ప్రభుత్వం రూ. 5 లక్షల పరిహారం ప్రకటించిందన్న తలసాని.. సర్కారు తరఫున అన్నివిధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాదానికి కారకులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
రాష్ట్రప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది: జంటనగరాల్లో వరుస అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నా.. రాష్ట్రప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. స్వప్నలోక్‌కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ఆయన.. ఆరుగురు మృతిచెందటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న యువత దుర్మరణం పాలవటం బాధాకరమన్నారు. సికింద్రాబాద్‌లో వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం సరైన విచారణ, నివారణ చర్యలు తీసుకోవటంలో నిర్లక్ష్యం వహించిందన్నారు.
విశ్వనగరమని కేటీఆర్ గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏమీ లేదు: విశ్వనగరమని కేటీఆర్ గొప్పలు చెప్పుకోవడం తప్ప.. ప్రజలకు కనీస భద్రత కల్పించడం లేదని ఆరోపించారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేసి భవిష్యత్ ఇలాంటివి జరవగకుండా చర్యలుచేపట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. స్వప్నలోక్‌ను పరిశీలించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్.. అగ్నిప్రమాదంలో 6 మంది యువతీ యువకులు మృతి చెందడం బాధాకరమన్నారు.
స్వప్నలోక్ కాంప్లెక్స్ వద్ద బీజేపీ కార్పొరేటర్లు, సీపీఐ నేతలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. స్వప్నలోక్ కాంప్లెక్స్‌కి రెండేళ్ల క్రితం నోటీస్ ఇచ్చినా స్పందనలేదని చెప్పారు. అగ్నిప్రమాద ఘటన బాధాకరమన్న జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత.. ప్రమాద ఘటనపై విచారణకు కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
స్వప్నలోక్ భవనంలో అగ్నిప్రమాదానికి విద్యుత్ షాక్‌నే ప్రధాన కారణమని భావిస్తున్నట్లు అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి వెల్లడించారు. భవనంలో అగ్నిప్రమాద పరికరాలు పెట్టినా.. ఏమాత్రం పని చేయలేదని చెప్పారు. దట్టమైన పొగ వల్లే కాల్‌సెంటర్‌లోని యువత ఊపిరాడక చనిపోయారని వివరించారు. అగ్నిప్రమాదంలో చనిపోయిన వారికి గాంధీఆసుపత్రిలో శవపంచనామా పూర్తైన తర్వాత కుటుంబ సభ్యులకు మృతదేహాలను పోలీసులు అప్పగించారు.
రూ.2లక్షల పరిహారం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం: స్వప్నలోక్ అగ్నిప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. అగ్ని ప్రమాదంలో మృతి చెందిన ఆరుగురిలో ఒక్కొక్కరికీ రూ. 2లక్షలను పరిహారంగా ప్రకటిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులకు రూ.50వేలు ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు.
ఇవీ చదవండి: