రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణ ప్రాంతాల్లో విజయ డెయిరీ ఇంటింటికీ పాలు సరఫరా చేస్తోంది. ఇప్పటి వరకు ఐదు జిల్లాల్లో నియంత్రణ ప్రకటించిన ఆరు ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. గడిచిన రెండు రోజులుగా కంటైన్‌మెంట్ క్లస్టర్లు, నియంత్రణ ప్రాంతాలుగా గుర్తించబడిన చోట్ల అవసరమైన దగ్గర డోర్ డెలివరీని మొదలుపెట్టేందుకు రాష్ట్ర పాడి పరిశ్రామిభివృద్ధి సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
రోజుకు 3 వేల లీటర్లు..
ఖమ్మం శివారు పెద్దతండా, ఆదిలాబాద్, నిర్మల్, మహబూబ్‌నగర్, వరంగల్ అర్బన్ జిల్లా జులైవాడ, మండిబజార్ ప్రాంతాల్లో రోజుకు దాదాపు 3 వేల లీటర్ల పాలు ఇంటి ముంగిటకే చేరవేస్తోంది. క్షేత్రస్థాయిలో వినియోగదారులకు మరింత అందుబాటులో ఉంచేందుకు మహబూబ్‌నగర్, ఖమ్మం, కామారెడ్డి, జనగామ, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, వరంగల్, మెదక్ జిల్లాల్లో సంచార అమ్మకం కేంద్రాలు సైతం ఏర్పాటు చేసింది. లాక్‌డౌన్ కారణంగా చిన్న డెయిరీలు గ్రామాల్లో పాడి రైతుల నుంచి పాలు సేకరించడం మానేశాయి. ఇలాంటి గ్రామాలను గుర్తించిన విజయ డెయిరీ యాజమాన్యం కొత్తగా 52 సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తోంది. ఫలితంగా లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ... పాల సేకరణ 35 వేల లీటర్లు పైగా పెరిగింది.
ఎక్కువగా టెట్రాప్యాక్లే..
హైదరాబాద్‌లోని కంటైన్‌మెంట్ క్లస్టర్లలో సైతం ఇంటింటికీ పాలు చేరవేసేందుకు సిద్ధంగా ఉన్నామని విజయ డెయిరీ ఎండీ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు బయటకు రావడాన్ని పూర్తిగా తగ్గించాలన్న ఉద్దేశంతో మూడు మాసాల పాటు ఉండే టెట్రాప్యాక్ ఉత్పత్తి కోసం అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ఈ ప్యాకెట్లు విస్తృతంగా చిల్లర మార్కెట్‌లోకి తీసుకువస్తామని చెప్పారు.
60 లక్షలకు పడిపోయిన వినియోగం..
లాక్‌డౌన్‌కు ముందు రాష్ట్రంలో రోజూ 68 లక్షల లీటర్ల పాల వినియోగం ఉండగా.. ప్రస్తుతం అది సుమారు 60 లక్షల లీటర్లకు పడిపోయింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 30 లక్షల లీటర్లు విక్రయించాలి. కానీ, హోటళ్లు, టీస్టాళ్లు మూసి ఉంచడం, లాక్‌డౌన్ ఆంక్షల వల్ల నగరంలో ఉండే చాలా మంది గ్రామాలకు వెళ్లిపోవడం వల్ల వినియోగం అమాంతం పడిపోయింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 4 లక్షల లీటర్ల వరకు వినియోగం తగ్గిపోగా... కొన్ని డెయిరీల పాల విక్రయ కేంద్రాలు మూతపడ్డాయి. పాల సరఫరాలో ఎలాంటి సమస్యలేమీ లేవని... డిమాండ్ మేరకు పాలు అందుబాటులో ఉన్నాయని విజయ డెయిరీ వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి: తెలంగాణలో 471కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు