దక్షిణ భారత దేశంలో బంగారానికి డిమాండ్ అధికంగా ఉంటుంది. దేశీయంగా ఉత్పత్తి లేకపోవడం, దిగుమతులే కీలకం అయినందున అక్రమార్కులు.. స్మగ్లింగ్‌ను కీలకంగా మార్చుకున్నారు. ఇలా ఇతర దేశాల నుంచి దొంగచాటుగా తీసుకొచ్చే బంగారంలో ఎక్కువ భాగం హైదరాబాద్, చెన్నై, బెంగళూరులకు చేరుతుంది.
పన్ను ఎగవేసేందుకు...
బంగారం దిగుమతి చేసుకోవడాన్ని నిలువరించేందుకు కేంద్ర ప్రభుత్వం 38.5 శాతం ఎక్సైజ్ సుంకం విధించింది. జీఎస్టీ మరో మూడు శాతం చెల్లించాల్సి ఉంటుంది. విదేశాల నుంచి తెచ్చిన బంగారం విలువపై ఎక్సైజ్ సుంకం, జీఎస్టీలు చెల్లిస్తే... స్థానిక ధరలతో సమానంగా కాని, ఎక్కువగానీ ఉంటుంది. అందువల్ల కొన్ని సార్లు నష్టం జరుగుతోంది. అందుకే విదేశాల నుంచి దొంగచాటుగా తీసుకొచ్చి ప్రభుత్వానికి చెల్లించాల్సిన 40 శాతం పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారు అక్రమార్కులు.
ధర పెరిగే... ఛాన్స్ దొరికే
ఇటీవల పసిడి ధర పది గ్రాములు 45 వేల వరకు పెరగడం కూడా స్మగ్లర్లను మరింత ప్రేరేపిస్తోంది. బంగారం పట్టుబడినా అసలు సూత్రధారులు దొరకకుండా మధ్యవర్తులను ఉపయోగించి స్మగ్లింగ్ చేయిస్తున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు విమానాశ్రయాల్లో డీఆర్‌ఐ, కస్టమ్స్, సీఐఎస్‌ఎఫ్ అధికారుల నిఘాను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ తమ ఎత్తులను మార్చుకుంటున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది.
రోడ్డు మార్గాన్నెంచుకున్నారు
గల్ఫ్ దేశాల నుంచే కాకుండా దేశ సరిహద్దు ప్రాంతాలైన భూటాన్, నేపాల్, మయన్మార్ దేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని... సరిహద్దులు దాటిస్తున్నట్లు నిఘా సంస్థల పరిశీలనలో వెల్లడైంది. అధికారుల కళ్లుగప్పి... అక్కడ నుంచి రోడ్డు మార్గాన గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
పట్టుకున్నారు
ఇటీవల చెన్నై నుంచి విజయవాడ మీదుగా వరంగల్, హైదరాబాద్‌లకు బంగారాన్ని తరలిస్తుండగా 31.5 కిలోలు పట్టుకుని 12 మందిని అరెస్ట్ చేశారు. రెండ్రోజుల కిందట బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రైవేట్ బస్సులో మూడు కిలోలకుపైగా బంగారాన్ని తరలిస్తుండగా పక్కా సమాచారంతో నలుగురిని అరెస్ట్ చేశారు.
దొరికితేే దొంగలు.. లేదంటే దొరలు
దొరికితే దొంగలు లేదంటే దొరలు లెక్కన స్మగ్లర్లు తమ రూటు మార్చి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. లక్ష రూపాయల బంగారంపై తక్కువలో తక్కువ రూ.40వేలు మిగులుతుండటం వల్ల తరచూ బంగారం పట్టుబడుతున్నా... అక్రమార్కులు తమ స్మగ్లింగ్‌ను మాత్రం ఆపడం లేదు. పక్కా సమాచారం ఉంటే తప్ప బంగారం పట్టుబడటం లేదని భావించిన నిఘా సంస్థలు ఇంటెలిజెన్స్‌ను బలోపేతం చేసుకుంటున్నాయి.