డెంగీ నివారణ చర్యలను ప్రతీ ఒక్కరు తమ ఇంటి నుంచే మొదలు పెట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ సూచించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ... రేపు జాతీయ డెంగీ దినోత్సవాన్ని జరుపుకోవాలన్నారు. దోమల నివారణ కోసం వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి వాటిని తొలగించాలని కమిషనర్ సూచించారు. పనికిరాని పాత్రలు, టైర్లు, పగిలిపోయిన బకెట్లు వంటి వాటిని చెత్త కుండీల్లో పడేయాలని తెలిపారు.
ఓవర్ హెడ్ ట్యాంకులు, సంపులు, డ్రమ్ములు, నీటితొట్ల మీద మూతలు పెట్టాలని లోకేష్ కుమార్ వెల్లడించారు. ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు కేటాయించి పరిసరాలను శుభ్రం చేసుకోవాలని కమిషనర్ తెలిపారు. ఇటువంటి విషయాల పట్ల ఫీల్డ్ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎంటమాలజీ ఉద్యోగులు, కార్యకర్తలు జీహెచ్ఎంసీ అంతటా దోమలు, లార్వాల నియంత్రణ మందులు పిచికారీ చేస్తున్నారని వివరించారు.
ఇవీ చదవండి: నేడు, రేపు కొవిడ్ వ్యాక్సినేషన్ నిలిపివేత