ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు గ్రేటర్ హైదరాబాద్ చర్యలు చేపట్టింది. జీహెచ్ఎంసీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.. ప్రధాన కూడళ్లు, జనం తిరిగే ప్రదేశాల్లో స్ప్రేతో శానిటైజ్ చేస్తున్నారు. స్వీయ క్వారంటైన్ జరిగిన ఇళ్లు, చుట్టుపక్కల ప్రాంతాలు, కరోనా పాజిటివ్ కేసులు గుర్తించిన ప్రాంతాలు, పరిసరాలలో కరోనా వైరస్ను నశింపజేసేందుకు చర్యలు చేపట్టారు. జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న 125 స్ప్రేయింగ్ యూనిట్లతో 150 వార్డుల్లో అవసరమైన చోట స్పెషల్ శానిటైజ్ స్ప్రేయింగ్లో పాల్గొంటున్నారు.
ఇంటింటా ఆరా...
ప్రతి యూనిట్లో 18మంది సిబ్బందితో పాటు ఈవీడీఎంలో శిక్షణ పొందిన 300 మంది సిబ్బంది పలు చోట్ల స్ప్రే చల్లుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన భారతీయులు, విదేశీయుల వివరాలను జీహెచ్ఎంసీ సేకరిస్తోంది. వారు స్వీయ క్వారంటైన్ అయ్యారా.. లేదా ఆరోగ్యస్థితి కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు.