Genome Valley Excellence Award 2022: వివిధ రకాల టీకాల అభివృద్ధికి విశిష్ట కృషి చేసిన అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన పెరల్‌మ్యాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ డ్రూ వైస్మాన్ జీనోమ్‌వ్యాలీ ప్రతిభా పురస్కారం-2022కి ఎంపికయ్యారు. ఆయనకు ఫైజర్, మోడెర్నా కరోనా టీకాల తయారీలోనూ భాగస్వామ్యం ఉంది. 2022లో ఆయన టైమ్ మ్యాగజైన్ నుంచి హీరోస్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం పొందారు.
ఈ నెల 24, 25 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించే అంతర్జాతీయ బయో ఆసియా సదస్సును పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం, ఆసియా బయోటెక్ సంఘాల సమాఖ్య డ్రూ వైస్మాన్‌ను జీనోమ్‌వ్యాలీ ప్రతిభా పురస్కారానికి ఎంపిక చేశాయి. పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు గురువారం ప్రగతిభవన్‌లో ఈ వివరాలను వెల్లడించారు. ‘‘ఏటా సదస్సు సందర్భంగా ప్రపంచంలో బయోటెక్, ఔషధ, జీవశాస్త్ర రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ఈ పురస్కారాన్ని అందజేస్తున్నాం. డ్రూ వైస్మాన్‌ను ఈసారి ఈ పురస్కారంతో గౌరవిస్తాం. సదస్సు చివరి రోజు ప్రదానం చేస్తాం. ఆయనను యువ శాస్త్రవేత్తలు ఆదర్శంగా తీసుకోవాలి’’ అని కేటీఆర్ ఆకాంక్షించారు.
ఇదీ చూడండి: ECLAT Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. రాష్ట్రంలో మరో రెండు ఎక్లాట్ కేంద్రాలు