సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో బుధవారం రాత్రి కరోనా వార్డులో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఇక్కడ చికిత్స పొందుతున్న మృతుడి సోదరుడి బంధువులు వైద్యుడిపై దాడికి పాల్పడటం కలకలం రేపింది. హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌కు చెందిన వ్యక్తి ఇటీవల దిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చాడు. తర్వాత కరోనా లక్షణాలు బయటపడటం వల్ల వైద్య సిబ్బంది అతనితో పాటు, భార్య, ఇద్దరు కుమారులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరీక్షల్లో నలుగురికీ కరోనా పాజిటివ్‌గా తేలింది. అప్పట్నుంచి ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారు. ఇంటి పెద్ద బుధవారం సాయంత్రం వార్డులోని స్నానాల గదిలోకి వెళ్లి కాలు జారి పడ్డాడు. సిబ్బంది హుటాహుటినా అతనికి చికిత్స అందించారు. కాసేపటికే గుండెపోటుతో అతను మరణించాడు. అతని మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ అక్కడే చికిత్స పొందుతున్న కుటుంబసభ్యులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. వైద్యులు, సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. కిటికి అద్దాలు పగలగొట్టి, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఈ పరిణామాలతో కరోనా వార్డులో అలజడి నెలకొంది. వైద్యులు ఉన్నతాధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అక్యూట్ రెస్పరేటరీ డిస్ట్రస్ సిండ్రోమ్..?
కొంతకాలంగా అతను అక్యూట్ రెస్పరేటరీ డిస్ట్రస్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నాడని.. ఆ కారణంగానే చనిపోయాడని వైద్యులు చెబుతున్నారు. తమపై దాడి చేయడం దారుణమని జూనియర్ వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి తమకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలని కోరారు. పరిస్థితిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌తో పాటు జూడాల అధ్యక్షుడితో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సమీక్షించారు. అదనపు భద్రత చర్యలకు హామీ ఇచ్చారు.
హేయమైన ఘటన..
వైద్యులపై దాడిని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి.. సేవ చేస్తున్న వైద్యులపై దాడి చేయటం హేయమైన ఘటన అని అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని క్షమించేది లేదని.. భవిష్యత్‌లో ఇలాంటివి చోటు చేసుకోకుండా చూసుకుంటామని వైద్యులకు హామీ ఇస్తూ ప్రకటన విడుదల చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.
కరోనాపై పోరాటంలో అలుపెరుగకుండా వైద్య సేవలు అందిస్తున్న వారిపై దాడి చేయడం మూర్కపు చర్య అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. విధుల్లో ఉన్న డాక్టర్లకు, శానిటేషన్ సిబ్బందికి పోలీసులు రక్షణ కల్పించాలన్నారు. వైద్యులపై దాడికి పాల్పడిన నిందితులను ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించినట్లు సమాచారం.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కరోనాతో మరో ముగ్గురి మృతి.. ఒక్కరోజే 30 కొత్త కేసులు