గ్రేటర్ హైదరాబాద్ కూడళ్లలో అవాంతరాలు లేకుండా వాహనాలు ప్రయాణించాలనే ఉద్దేశంతో జీహెచ్ఎంసీ 2015లో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం తీసుకొచ్చింది. 25 వేల కోట్ల అంచనాతో ప్రతిపాదించిన ప్రాజెక్టులు కొన్ని పట్టాలెక్కగా... మరికొన్ని నత్తనడకన సాగుతున్నాయి. స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ద్వారా బాండ్లు జారీచేసి అధికారులు 395 కోట్లు సమీకరించారు. ఈ నిధులు అయిపోయిన తర్వాత పనుల్లో వేగం తగ్గిపోయింది.
ఎల్బీనగర్‌లో కామినేని కూడలి-బైరామల్‌గూడ దిశలో చేపట్టిన అండర్‌పాస్ మార్గం పనులు రెండేళ్లయినా 50 శాతం కూడా పూర్తికాలేదు. షేక్‌పేట బృందావన కాలనీ నుంచి రాయదుర్గం మల్కం చెరువు వరకు ఏడాదిన్నర క్రితం మొదలైన పైవంతెన పనులు నెమ్మదించాయి. మొత్తం 73 పిల్లర్లు నిర్మించాల్సి ఉండగా 40 మాత్రమే పూర్తయ్యాయి. భూసేకరణ జరగకపోవడం, నిధుల కొరతతో ఇక్కడ 30 శాతం పనులే జరిగాయి.
నిధులు లేక నిలిచిన వ్యూహాత్మక రహదారులు ఎల్బీనగర్-నాగోల్ మధ్య రాకపోకల వేగవంతానికి 90 కోట్ల రూపాయలతో కామినేని కూడలిలో రెండు పైవంతెనలు నిర్మించేందుకు బల్దియా రంగం సిద్ధం చేసింది. ఓవైసీ ఆసుపత్రి వద్ద కారిడార్ అభివృద్ధి పనులు ఏడాదిన్నర కిందట పలు సవరణలతో పట్టాలెక్కాయి. ఎల్బీనగర్-శంషాబాద్ విమానాశ్రయం మార్గాన్ని ఆధునీకరణలో భాగంగా ఈ పైవంతెన ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ వంతెన అందుబాటులోకి వస్తే ఎల్బీనగర్-విమానాశ్రయం వెళ్లే వాహనాలకు ఒక లైను, విమానాశ్రయం-ఎల్బీనగర్ వచ్చే వాహనాలకు రెండు లైన్లను కేటాయించవచ్చు. సాగర్ రింగురోడ్డుపై కీలకమైన బైరామల్‌గూడ కూడలిలో రెండు స్థాయిల్లో పైవంతెనలు, రెండు లూప్‌లు నిర్మాణం కావాలి. నిధుల కొరతతో పాటు భూసేకరణ సమస్యతో ప్రస్తుతం బల్దియా లూప్‌ల నిర్మాణాన్ని పక్కనపెట్టింది. ఎస్సార్డీపీకి సంబంధించి ప్రస్తుతం 80 కోట్ల రూపాయల బిల్లులు ఆగిపోగా... మరో 100 కోట్ల పనులకు బిల్లులు సిద్ధమమ్యాయి. బల్దియా వద్ద నిధుల్లేక... సొంత నిధులనే చెల్లిస్తూ వచ్చారు. ప్రస్తుతం నగర వ్యాప్తంగా అభివృద్ధి పనులకు 2 వేలకు పైగా ఆస్తులను సేకరించాల్సి ఉంది. నగర ప్రణాళిక విభాగం, భూసేకరణ విభాగ అధికారులు ప్రక్రియ ముందుకు తీసుకెళ్లడంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరగా పూర్తిచేసి సమస్యలను పరిష్కరించాలని వాహన చోదకులు కోరుతున్నారు. ఇవీ చూడండి: దేశవ్యాప్తంగా వర్షబీభత్సం.. 114కు చేరిన మృతులు