ఏపీలోని తిరుమల శ్రీవారి పరకామణి నూతన భవన నిర్మాణానికి తితిదే ఛైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి భూమి పూజ చేశారు. వెంగమాంబ అన్నదాన భవనం సమీపంలో దాదాపు 15వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 8.90 కోట్ల రూపాయలతో ఈ భవనం నిర్మించనున్నారు. పశ్చిమగోదావరి తాడేపల్లిగూడెం నుంచి బెంగళూరు వెళ్లి స్థిరపడ్డ వ్యాపారి, శ్రీవారి భక్తుడు మురళీకృష్ణ .. పరకామణి భవన నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని విరాళంగా అందచేసినట్లు ఛైర్మన్ తెలిపారు.
శ్రీవారి ఆలయ ఆవరణలో ఉన్న పాత పరకామణి భవనంలో శ్రీవారి కానుకలు, హుండీ లెక్కింపునకు ఇబ్బందులు ఎదురవుతున్నందున అధునాతన భవనాన్ని నిర్మిస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 2 అంతస్థుల్లో నిర్మించనున్న నూతన భవనంలో హుండీ, విరాళాల లెక్కింపు ఒకే ప్రాంగణంలో నిర్వహించేలా ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులు తాము స్వామివారికి సమర్పించుకొన్న కానుకల లెక్కింపు విధానాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుగా భవన నిర్మాణాలను రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాత మురళీకృష్ణ, అదనపు ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు.
ఇవీ చదవండి.. ప్రజల్లో అవగాహన.. మద్యం మాఫియాకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక కార్యక్రమం