దేశంలోనే ఎక్కువ మొక్కలు నాటిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్న కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో ప్రకటనపై అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అటవీ శాఖతో పాటు ఇతర శాఖల అధికారుల కృషిని మంత్రి అభినందించారు. ఇదే స్ఫూర్తితో వచ్చే సీజన్లో ప్రారంభం కానున్న ఏడో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయంవంతం చేయాలని పిలుపునిచ్చారు.
దేశవ్యాప్తంగా 2019 -2020 సంవత్సరంలో 150 కోట్లా 23 లక్షల మొక్కలు నాటగా ఒక్క తెలంగాణలోనే 38 కోట్లా 17 లక్షల మొక్కలు నాటినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. పర్యావరణ సమతుల్యత, పచ్చదనం పెంపే లక్ష్యంగా 2015లో సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని అన్నారు. కార్యక్రమంలో పెద్దఎత్తున ప్రజలను భాగస్వాములను చేయడంతో పాటు నాటిన మొక్కలను సంరక్షించాలని కఠిన చట్టాలను తీసుకురావడం, అధికారుల నిర్విరామ కృషితోనే ఇది సాధ్యమైందని మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: సవాళ్లను స్వీకరించే మహిళా.. నీకు వందనం