తెలంగాణలో సర్కారీ విద్యార్థులకు ప్రభుత్వం టీవీ పాఠాలు బోధిస్తున్నా, హోంవర్క్ చేయడానికి, సందేహాల నివృత్తికి ఫోన్‌పై ఆధారపడాల్సి వస్తోంది. ఈ మేరకు పేదలతో పాట మధ్యతరగతి కుటుంబాలూ అప్పో సప్పో చేసి తమ పిల్లల కోసం స్మార్ట్‌ఫోన్లు కొనివ్వాల్సిన పరిస్థితి. మరికొందరు టీవీలను కొంటున్నారు. అవసరం ఉన్నా, లేకున్నా పిల్లలు ఒత్తిడి చేస్తుండటంతో నానాతిప్పలుపడి ఫోన్‌లు కొని ఇస్తున్న వారూ ఉన్నారు.
అన్నీ ఉన్నా సాంకేతిక అంతర్జాల సంకేతాలు అందకపోవడం, డేటా వేగం లేకపోవడం వంటి సమస్యలతో చెట్లు,పుట్టలు ఎక్కి చదువుకుంటున్న వారి సంగతి సరేసరి. విద్యాశాఖ ఆదేశాల మేరకు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశాం. అందులో హోంవర్క్, ఆదేశాలు, సూచనలు పంపిస్తున్నాం. హోంవర్క్ చేసి మళ్లీ విద్యార్థులు తిరిగి పంపించాలి.
ముఖ్యంగా ఏడు, పదో తరగతి విద్యార్థులకు ఇది తప్పనిసరి. అందుకే కష్టమైనా వారు స్మార్ట్‌ఫోన్‌లు కొనకతప్పడం లేదు’ అని పలువురు ఉపాధ్యాయులు ‘ఈనాడు’తో చెప్పారు. టీవీలు/ఫోన్‌లు కొనే స్థోమత లేక పాఠాలకు దూరమవుతున్న వారూ ఉన్నారని తెలిపారు. కరోనాతో ఉపాధి కోల్పోయి ఉసూరుమంటున్న పేద, మధ్య, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు ఇది మోయలేని భారమేనని ఉపాధ్యాయ సంఘాల నేతలూ అంగీకరిస్తున్నారు.
ఇది ‘ఊపిరిపోతుంటే..ముక్కుమూశారన్న’ సామెతను గుర్తుకు తెస్తోందని వాపోతున్నారు. అన్నీఉన్నా సాంకేతిక అంతర్జాల సంకేతాలు అందకపోవడం, వేగం లేకపోవడం వంటి సమస్యలతో చెట్లు,పుట్టలు ఎక్కి చదువుకుంటున్న వారి సంగతి సరేసరి.
కొన్ని బడుల్లో ఇదీ పరిస్థితి...
- ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో పదో తరగతి ‘ఏ’ సెక్షన్‌లో 32 మంది విద్యార్థులుండగా అందులో 17 మందికి స్మార్ట్‌ఫోన్లున్నాయి. వారిలో 10 మంది వరకు ఈ నెల 1వ తేదీ తర్వాత సమకూర్చుకున్నవారే.
- ఆసిఫాబాద్ కుమురంభీం జిల్లా కెరమెరి మండలం సావర్‌ఖేడ్ ప్రాథమిక పాఠశాలలో 3, 4, 5 తరగతుల్లో 204 మంది విద్యార్థులు ఉండగా, ఈ నెల 1వ తేదీ తర్వాత 30 మంది కొత్తగా ఫోన్లు కొన్నారు. కొనలేని వారు పంచాయతీ కార్యాలయంలోని టీవీలో పాఠాలు వింటున్నారు.
- మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఫోన్లు ఉన్నా ఇంటర్‌నెట్ డేటా రీఛార్జి స్థోమత లేని వాళ్లు చాలామందే ఉన్నట్టు గుర్తించిన మేడ్చల్ జిల్లా గెజిడెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ రోటరీ క్లబ్ ప్రతినిధులను సంప్రదించారు. వారు కౌకూర్ ఉన్నత పాఠశాలలోని 40 మంది విద్యార్థుల ఫోన్లకు మూడు నెలలకు డేటా రీఛార్జి చేయించారు.
- ఆదిలాబాద్ గ్రామీణ మండలం అంకోలి ఉన్నత పాఠశాలలో 327 మంది విద్యార్థులుండగా అందులో 37 మందికి టీవీలు లేవు. పిల్లల్లో 151 మందికే ఫోన్లున్నాయి.
కూలి పనులే ఆధారం...ఫోన్ ఎలా కొనగలం?
ఈ ఫొటోలో ఉన్నది ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి సమీపంలోని లాలా ముత్నూరు గ్రామంలోని గంగ, ఆమె ముగ్గురు కుమారులు. పిల్లలు 4, 6, 10 తరగతులు చదువుతున్నారు. భర్త చనిపోవడంతో కూలి పనులతో ఆమె ఒక్కరే కుటుంబ భారాన్ని మోస్తున్నారు. ఇంట్లో టీవీ లేదు. స్మార్ట్‌ఫోన్ కొనిచ్చే తాహతూ లేదు. ప్రస్తుతం ముగ్గురూ అటు ఆన్‌లైన్, ఇటు టీవీ పాఠాలకు దూరమయ్యారు. ‘మొదట్లో రెండు మూడు రోజులు పక్కంటికి వెళ్లి పాఠాలు విన్నా. వారు పొలం పనులకు వెళ్తూ ఇంటికి తాళం వేస్తుంటంతో వాటికీ దూరమయ్యానని’ పెద్ద కుమారుడు లక్ష్మీకాంత్ ‘ఈనాడు’తో వాపోయాడు.
ఇసుక మోసి, ఫోన్ కొన్నాడు
ఆ విద్యార్థి పేరు సిర్ర శివరామ్. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఒద్యారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. నాన్న కూలీ. అమ్మకు అనారోగ్యం. నాన్న సంపాదన కాస్తా అమ్మ మందులకు, కుటుంబం గడవడానికే సరిపోని పరిస్థితి. దీంతో ఇతను నెల రోజులు రేవులో ఇసుక ఎత్తే పనికి వెళ్లి రూ.7,700లతో స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నాడు.
అప్పు చేసి కుమారుడికి స్మార్ట్‌ఫోన్
మొబైల్ ఫోన్‌లో డిజిటల్ తరగతులు వింటున్న ఈ విద్యార్థి పేరు బొడ్డు అరుణ్. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం లక్ష్మీపురానికి చెందిన ఇతను తీగలవేణి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఆర్థిక స్థోమత సహకరించకున్నా, అప్పుచేసి మరీ రూ.8,500లతో స్మార్ట్‌ఫోన్ కొనిచ్చానని అతని తండ్రి, మేకల కాపరైన దర్గయ్య చెప్పారు.
15 రోజుల భారం రూ.70 కోట్లు
ఈ నెల 1వ తేదీ నుంచి 3-10 తరగతులకు డిజిటల్ పాఠాలు ప్రారంభమయ్యాయి. పాఠాలు ప్రారంభించిన రోజు(1వ తేదీ) 1,91,768 మంది స్మార్ట్‌ఫోన్లు/ల్యాప్‌టాప్‌ల ద్వారా పాఠాలు వీక్షిస్తున్నారని విద్యాశాఖ గణాంకాలు వెల్లడించింది. తాజాగా ఆ సంఖ్య 2,19,285కి పెరిగింది. అంటే 27,517 మంది పెరిగారు. దీన్నిబట్టి ఆ మేరకు ఫోన్లు/ఇతర ఉపకరణాల కొనుగోళ్లు పెరిగినట్లేనని స్పష్టమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 15 రోజుల్లో కనీసం లక్షకుపైగానే స్మార్ట్ ఫోన్లును సర్కారు పాఠశాలల విద్యార్థులు కొనుగోలు చేసి ఉంటారని అనధికారిక అంచనా. ఒక్కో ఫోన్ సగటున రూ.7 వేలు అనుకున్నా లక్ష ఫోన్లకు రూ.70 కోట్లు ఖర్చు చేసినట్టే లెక్క.
ఇదీ చదవండిః 'జీవో ఉల్లంఘించిన 55 పాఠశాలలకు షోకాజ్ నోటీసులు'