రాష్ట్ర సచివాలయంలో పెండింగ్‌లో ఉన్న అనిశా కేసులపై త్వరగా విచారణ జరిపించాలని సుపరిపాలక వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి గవర్నర్‌కు లేఖ రాశారు. రెవెన్యూ, హోం, మున్సిపాలిటీ, రవాణా వంటి శాఖల్లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులతోపాటు అనిశా వలలో చిక్కిన కేసులు సుమారు 300 ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అనిశా అధికారులు కొమ్ముకాయడం.. అవినీతికి ఊతమిచ్చినట్లుగా ఉందని ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకువస్తున్నట్లు లేఖలో తెలిపారు.
2016లో రవాణాలోని ఓ ఉద్యోగి లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడగా.. 2020లో మరోసారి పట్టుబడ్డాడు. అతనిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కూడా నమోదు చేశారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పద్మనాభరెడ్డి ఆరోపించారు. అనిశా అధికారులు కేసులు నమోదు చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడం వల్ల కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయని వివరించారు. ఓ అధికారి లంచం తీసుకున్నాడా లేదా అని న్యాయస్థానం తేల్చాలే తప్ప సచివాయలంలో ఉన్న సెక్షన్ అధికారి కాదని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి: కోదండరాం