Problems with Dharani Website : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ధరణిని తీసుకొచ్చింది. భూముల చిక్కులు విప్పడంతో పాటు పారదర్శకతకు పెద్ద పీట వెయ్యాలన్న ఉద్దేశంతో ధరణి వెబ్‌సైట్ తెచ్చింది. సాంకేతిక సమస్యలతో ధరణిలో రైతుల భూములు ఒకరివి మరొకరి దాంట్లో నమోదు కావడం, కొందరి భూములు నిషేధిత జాబితాల్లో నమోదు చేయడం, లేదంటే కొన్ని సర్వే నంబర్లు మాయం కావడం.. ఇలాంటివి రైతులకు అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ధరణి ఆపరేటర్ల నిర్వాకం..: వీటిని సరిదిద్దేందుకు రైతులు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా ఉన్నతాధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కలెక్టర్లకు అధికారం ఇవ్వగా.. చాలా వరకు సమస్యలు పరిష్కరించారు. అయితే ఇటీవల వెలుగు చూస్తున్న ఘటనల్లో.. ధరణి పేరుతో కొందరు అక్రమాలకు తెరలేపుతుండటం ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడిచేలా చేస్తోంది. వ్యవస్థలోని లోపాలు ఆసరాగా చేసుకొని ధరణి ఆపరేటర్లు కొన్నిచోట్ల అధికారులకు తెలియకుండా, మరికొన్నిచోట్ల అధికారులతో కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
బతికుండగానే చనిపోయినట్లు..: ధరణి లోపాలకు సంబంధించి అనేక ఉదాహరణలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేటకు చెందిన మ్యాదరి లక్ష్మి.. జీవించి ఉండగానే చనిపోయినట్లు పత్రాలు సృష్టించి తహసీల్దార్‌కు తెలియకుండా మండల ధరణి ఆపరేటర్ సాయంతో ఆమె మనవడైన రాజకుమార్ 1.30 ఎకరాలకు తన పేరుతో వారసత్వ మార్పు చేయించుకున్నారు. లక్ష్మి చనిపోలేదని ఉన్నతాధికారుల విచారణలో తెలియడంతో ధరణి ఆపరేటర్‌ను గతేడాది డిసెంబరులో విధుల నుంచి తొలగించారు. తహసీల్దార్‌ను సస్పెండ్ చేశారు.
ఏడాది కిందట లింగంపేట మండలం బూరుగిద్దలో గ్రామస్థులు నివాసం ఉండే స్థలాన్ని కొందరు అక్రమార్కులు తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సదరు రిజిస్ట్రేషన్ రద్దు కోసం రెవెన్యూ అధికారులు సీసీఎల్ఏకు నివేదించి సరిపెట్టారు. గ్రామస్థుల విన్నపం మేరకు జీపీ నుంచి నివాస పత్రాలు పంపిణీ చేశారు. రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన ఓ దివ్యాంగుడి పేరిట ధరణి పోర్టల్.. డమ్మీ ఖాతాలో 28 ఎకరాలు ఉన్నట్టు చూపిస్తోంది.
నాగిరెడ్డిపేట మండలం చీనూర్‌లో భూములున్నప్పటికీ ఆర్ఎస్ఆర్‌లో కొన్నింటి వివరాలు నమోదు కాలేదు. దీనికి తోడు డబుల్ సర్వే నంబర్ల పై నమోదయ్యాయి. సుమారు 120 మంది రైతులకు పట్టా పుస్తకాలు మంజూరు నిలిపివేశారు. నిజాంసాగర్ మండలంలోని సింగీతం గ్రామ పంచాయతీ పరిధిలోని శేర్కాట్పల్లి రెవెన్యూ గ్రామమైనా.. అక్కడి భూములకు పట్టాలు మంజూరు కావడం లేదు. అవన్నీ అటవీ శాఖ పరిధిలో నమోదు చేయడమే ఇందుకు కారణం. ఇందువల్ల అన్నదాతలు రైతుబంధు, బీమా పథకాలకు దూరమవుతున్నారు.
సర్వే నంబర్ల గోల్మాల్..: కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ధరణి సాంకేతిక సమస్యలతో పాటు ఆపరేటర్లు చేస్తున్న పనుల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుల్లో ధరణి సమస్యలే అధికంగా ఉంటున్నాయి. విస్తీర్ణంలో తేడాలు సహా సర్వే నంబర్లు లేకపోవడం, కొనుగోలు చేసినా తమ పేరుపై మార్పు చేసుకోకపోవడం, క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయకుండా ఆన్ లైన్ చెయ్యడం వల్ల ఒకరి భూమి మరొకరి పేరు మీద నమోదు కావడం వంటివి జరిగాయి. వీటిలో కొన్ని సమస్యలు పరిష్కారం అయినా.. ఇంకా చాలా ఇబ్బందులు మిగిలే ఉన్నాయి.
ఇకపై కలెక్టర్ల చేతిలో..: భూములకు సంబంధించి ఏ మార్పు చేయలన్నా కలెక్టర్ల చేతిలో పెడితేనే అక్రమాలకు చోటు ఉండదని సర్కార్ భావించింది. అందులో భాగంగానే వీఆర్వో వ్యవస్థను రద్దు చేసింది. రెవెన్యూ ట్రైబ్యునళ్లనూ తొలగించింది. ఇప్పుడు ధరణిలో పేర్లను సరి చేయడం దగ్గరి నుంచి ఏదైనా సరే కలెక్టర్ చేయాల్సిందే. కలెక్టర్ ఓకే చేస్తేనే ధరణి పోర్టల్‌లో మార్పులు జరుగుతాయి. ధరణి విషయంలో ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి సమస్యలు పరిష్కరించాలని రైతులు, సామాన్య ప్రజలు కోరుతున్నారు. లేదంటే ఇబ్బందులు కొనసాగుతూనే ఉంటాయని అంటున్నారు.
ఇవీ చదవండి: