ఆంధ్రప్రదేశ్‌లో గృహ వినియోగదారుడికి ఇకపై కనీస ఛార్జీలు ఉండవని ఆ రాష్ట్ర ఈఆర్‌సీ ఛైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి ప్రకటించారు. విశాఖలో కొత్త విద్యుత్ టారిఫ్ ప్రకటించిన విద్యుత్ నియంత్రణ సంస్థ... వచ్చే ఆర్థిక సంవత్సరానికి కొత్త టారిఫ్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. సగటు యూనిట్ ధర రూ.7.17 నుంచి రూ.6.37కు తగ్గిస్తున్నట్టు నాగార్జునరెడ్డి వెల్లడించారు. పవన, సౌరవిద్యుత్ ఉత్పత్తికి పీపీఏ బదులుగా తాత్కాలిక టారిఫ్ వర్తిస్తుందని చెప్పారు.
కులవృత్తుల వారికిచ్చే ఉచిత విద్యుత్ కొనసాగుతుందన్న నాగార్జునరెడ్డి.. కులవృత్తులకు ఇచ్చే ఉచిత విద్యుత్ వల్ల రూ.1,657 కోట్ల భారం పడుతుందని వివరించారు. గృహ వినియోగదారుడికి ఇకపై కనీస ఛార్జీలు ఉండవని.. కనీస ఛార్జీల స్థానంలో కిలోవాట్‌కు రూ.10 చెల్లిస్తే చాలని ఏపీ ఈఆర్‌సీ ఛైర్మన్ నాగార్జునరెడ్డి వెల్లడించారు. ఫంక్షన్ హాళ్లకు ఇకపై నిర్దిష్ట ఛార్జీలు ఉండవని వివరించారు.
పరిశ్రమల కేటగిరీలో ఆక్వా, పౌల్ట్రీ రంగాలు చేర్చబోమని ఆయన స్పష్టం చేశారు. రైతుల ఉచిత విద్యుత్‌కు రూ.7,297 కోట్లు భరించేందుకు ప్రభుత్వం సమ్మతించిందని వెల్లడించారు. డిస్కమ్‌లకు రూ.11,741.18 లోటు వస్తుందని చెప్పాయని వివరించారు. ఇందులో రూ.4,307.38 కోట్ల భారం వినియోగదారులు, ప్రభుత్వంపై పడకుండా ఉండే ప్రతిపాదనలను మాత్రమే ఆమోదించామని నాగార్జునరెడ్డి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 'ఆటో డెబిట్' కొత్త రూల్స్ అమలు వాయిదా