CS VEHICLE PLATE: సామాన్యులు ట్రాఫిక్ నిబంధనలో, రవాణాశాఖ నిర్దేశాలనో ఉల్లంఘిస్తే.. ముక్కు పిండి మరీ జరిమానాలు వసూలు చేస్తారు. మరి ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉల్లంఘిస్తే.. అవి పోలీసులకు కనిపించవా అనే ప్రశ్నలు పౌరుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అధికారులందరికీ బాస్ అయిన సీఎస్ వాహనమే.. హై సెక్యూరిటీ నంబర్ ప్లేటు లేకుండా.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా.. టింటెడ్ గ్లాస్‌లతో నిబంధనల్ని యథేచ్ఛగా తుంగలో తొక్కేస్తోంది. ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ వినియోగిస్తున్న వాహనం ఈ ఏడాది ఆగస్టు 21న రిజిస్ట్రేషన్ అయింది. దీనికి రవాణాశాఖ నిబంధనల ప్రకారం హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ ఉండాలి.
వాహనం విక్రయించిన డీలరే దీనిని అమరుస్తారు. ఈ వాహనానికి వేరొక నంబర్ ప్లేట్ అమర్చారు. అలాగే AP 39 K Q 0001 అనే నంబరును రవాణాశాఖ కేటాయిస్తే.. అందులో మూడు సున్నాలు తీసేసి.. కేవలం 1 సంఖ్య మాత్రమే పెద్దదిగా ఉంచారు. ఇది మరో ఉల్లంఘన కిందకు వస్తుంది. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌లో అక్షరాలు, నంబర్లు పూర్తిగా ఉండటంతో పాటు.. అవి వేర్వేరు సైజుల్లో కాకుండా.. ఒకే ఫాంట్‌తో ఉంటాయి. ఇలా సీఎస్ వినియోగించే వాహనమే రవాణా శాఖ నిబంధనల్ని ఉల్లంఘించడం.. చర్చనీయాంశమైంది.