పంట తెగుళ్ల నివారణకు రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు ‘క్రాప్ దర్పణ్’ పేరిట ప్రత్యేక యాప్‌ను రూపొందించింది హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ. రైతులు తమ స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని.. పంటకు సోకిన తెగులు లక్షణాలను అందులో నమోదు చేయాలి. యాప్‌లో పేర్కొన్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. దీని ఆధారంగా తెగులును నిర్ధారించుకుని అందుకు ఏ మందులు ఎంత మోతాదులో పిచికారీ చేయాలనే సమాచారాన్ని రైతుకు ఇస్తుంది.
ప్రస్తుతం పత్తి పంటకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. పది రోజుల్లో వరికి సంబంధించిన సమాచారం అందుబాటులోకి తీసుకురానున్నట్లు.. ఐఐఐటీలోని డాటాసైన్స్ అండ్ అనలిటిక్స్ సెంటర్, ఐటీ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్(ఐటీఏఆర్‌సీ) ఆచార్యుడు ప్రొ.పి.కృష్ణారెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో 200 పంటల సమాచారం సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు ‘ఈటీవీ భారత్‌కు వివరించారు. ప్రస్తుతం తెలుగు, ఆంగ్లంలో సమాచారం అందుబాటులో ఉందన్నారు.
కృష్ణారెడ్డి నేతృత్వంలో శ్రీనివాస్‌రెడ్డి, నరేంద్రబాబు, అరవింద్‌సాయి, సాయిదీప్, రేవంత్ బృందం ఈ యాప్‌ను తయారు చేసింది. భారత్-జపాన్ సంయుక్త పరిశోధన ల్యాబొరేటరీ ప్రాజెక్టు కింద రెండేళ్ల క్రితం ఈ ప్రాజెక్టును చేపట్టి ప్రస్తుతం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ బాంబే, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, టోక్యో వర్సిటీ సంయుక్త సహకారం అందించాయి.
ఇదీ చదవండి: సాగుపై ప్రత్యేక శ్రద్ధ.. నేడు సీఎం కేసీఆర్ కీలక సమీక్ష