జీహెచ్ఎంసీ అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల చిరు వ్యాపారుల బతుకులు రోడ్డుపాలు అయ్యాయని సీపీఐ నాయకులు ఆరోపించారు. హైదరాబాద్ నారాయణగూడ ఫ్లై ఓవర్ కింద ఉన్న లింగంపల్లి మార్కెట్ కూల్చివేతతో రోడ్డున పడ్డ చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ... జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఉదయాన్నే అధికారులు ఆగమేఘాల మీద పోలీసు బందోబస్తుతో వచ్చి... మార్కెట్‌ను కూల్చి వేయడం వ్యాపారుల జీవితాలతో చెలగాటమాడడం కాదా అని సీపీఐ హైదరాబాద్ కార్యదర్శి నరసింహ ప్రశ్నించారు.
దుర్భర పరిస్థితి
దసరా పండుగ కోసం వ్యాపారులు అప్పులు చేసి సరకులను నిల్వ చేసుకున్నారని... సమాచారం ఇవ్వకుండా మార్కెట్ కూల్చి వేయడం వల్ల అందులోనున్న రూ.లక్షల సరకులు చెల్లాచెదురై ఎందుకు పనికి రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు దశాబ్దాల నుంచి వ్యాపారాలు చేసుకుంటున్నారని గుర్తు చేశారు. మార్కెట్ కూల్చివేతతో వారికి దుర్భర పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కమీషన్లు దండుకోవడానికే మార్కెట్ పునర్నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు.
ప్రత్యామ్నాయం చూపాలి
నిర్మాణం పూర్తయ్యేంత వరకు ప్రత్యామ్నాయం చూపాలని... నష్టపోయిన చిరు వ్యాపారులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు లింగంపల్లి మార్కెట్ చిరు వ్యాపారులకు అండగా ఉంటామని... అన్యాయం జరిగితే సహించేది లేదని ఈటీ నరసింహ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'ప్రభుత్వ ఖజానాను నింపుకునేందుకే ఎల్ఆర్ఎస్ విధానం'