రాజకీయ పార్టీలు విభేదాలు పక్కనపెట్టి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లేఖ రాసినట్లు తెలిపారు. హైదరాబాద్ సైఫాబాద్‌లోని యూనియన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎదుట యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ ఆందోళనను దేశ వ్యాప్తంగా ఉద్ధృతం చేసేందుకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రమాదంలో పడ్డాయని నారాయణ పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు విభేదాలు పక్కనపెట్టి.. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోన్న మోదీ పతనం కోసం పని చేయాలని కోరారు. అన్ని పక్షాలు ఏకమై.. ఐక్య ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
సమ్మె విజయవంతం..
రెండు రోజుల సమ్మె విజయవంతం అయ్యిందని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ నాయకుడు రాంబాబు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణపై దిల్లీలో అన్ని బ్యాంకు సంఘాల ప్రతినిధులు పాల్గొననున్నట్లు వెల్లడించారు. తమ డిమాండ్ల సాధన కోసం పోరాడతామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: డీజీపీ కార్యాలయం ముట్టడి.. భజరంగ్‌దళ్ కార్యకర్తల అరెస్ట్