వైరస్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగినవారందరినీ అధికారులు గుర్తించే పనుల్లో నిమగ్నమైపోయారు. ఇలా చేయడం వల్ల వారితో పాటు ఇతరులకూ నష్టం జరుగుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వారంతా 104 కాల్‌సెంటరు లేదా జీహెచ్‌ఎంసీ కాల్ సెంటరు 040-2111 1111ను సంప్రదించి క్వారంటైన్ కావాలని కోరుతున్నారు. వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని, వైరస్ బారినపడినట్లు తేలితే చికిత్స తీసుకుని స్వస్థత పొందవచ్చని అవగాహన కల్పిస్తున్నారు. సుమారు 80శాతానికిపైగా పాజిటివ్ కేసులు ఈ తరహా విచారణతో వెలుగులోకి వచ్చాయని అధికారులు చెబుతున్నారు.
సమగ్ర విచారణతో...
రాష్ట్రంలోని మొత్తం కొవిడ్ కేసులను పరిశీలిస్తే సగానికిపైగా రాజధానిలోనివే. మార్చి రెండో వారంలో మర్కజ్ నుంచి నగరానికి వచ్చిన స్థానికులు, వారితో కలివిడిగా మెలిగినవారితో సంఖ్య అమాంతం పెరిగింది. తొలుత వైద్య పరీక్షల కోసం మర్కజ్ ప్రయాణికులను గుర్తించడంలో అధికారులు అవస్థలు పడ్డారు. పలువురు ఫోన్ నంబర్లను తొలగించడం, ఇళ్లకు తాళాలు వేసి బయట తిరగడం, బంధువుల వద్ద ఆశ్రయం పొందడం వంటివి చేశారు. దీంతో వ్యాధి పరోక్షంగా విస్తరించడం మొదలైంది. అధికారులు వివిధ ప్రణాళికలతో అందరినీ గుర్తించి క్వారంటైన్ చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించి కరోనా ఉన్నవారి లెక్కతేల్చారు. చికిత్స అందిస్తూ.. వారితో కలివిడిగా ఉన్నవారికీ పరీక్షలు చేశారు. పాజిటివ్‌గా తేలితే ఎప్పటిలానే వారినీ విచారించడం, సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల పట్ల అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతోంది. మెజార్టీ కేసులు ఇలా వెలుగులోకి వచ్చినవేనని, కొత్తగా నమోదవుతున్నవి సుమారు 20శాతం ఉంటాయని చెబుతున్నారు.
ఆ 151 జోన్లలో..
గ్రేటర్ పరిధిలో ఈనెల 19 వరకు 151 కంటైన్‌మెంట్ జోన్లు ఉండగా అందులో 353 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. పాతనగరంలో 140 మంది బాధితులు ఉండటం గమనార్హం. కలివిడిగా మెలిగినవారిని గుర్తించి వైద్య పరీక్షలు చేయగా... కొత్తగా ఎల్బీనగర్ జోన్‌లో సోమవారం ఇద్దరు బాధితులను గుర్తించగలిగామని అధికారులు తెలిపారు. ఖైరతాబాద్ జోన్‌లోనూ పరిస్థితి అదుపులోకి వచ్చిందని, జనాన్ని నిలువరించేందుకు చేపట్టిన చర్యలతో వ్యాప్తి అక్కడికే పరిమితమైనట్లు కనిపిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.
ఇవీ చూడండి: ఏపీలో ఒక్క రోజే 75 కేసులు.. పాజిటివ్ కేసుల్లో దేశంలో 9వ స్థానం