గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ వెయ్యి మందికి పైగా కొత్తగా వ్యాధి భారిన పడుతున్నారు. కరోనా కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు కూడా మూతపడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. కరోనా లక్షణాలతో పాటు అనుమానితులు వేల సంఖ్యలో వైద్య పరీక్షల కోసం బారులు తీరుతున్నారు. రోగుల సంఖ్య అంచనాలు మించటంతో వారిని పర్యవేక్షించటం వైద్య, ఆరోగ్య శాఖకు, జీహెచ్‌ఎంసీకి, పోలీసులకు భారంగా మారింది.
సర్కిల్ టాక్స్ ఇన్ స్పెక్టర్ మృతి
జంటనగరాల్లో 12 వేల మందికిపైగా ఇళ్లలోనే ఉండి కరోనా చికిత్స పొందుతున్నారు. ఇవాళ కూడా జంటనగరాల పరిధిలో పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. జీహెచ్ఎంసీ అబిడ్స్ సర్కిల్ టాక్స్ ఇన్ స్పెక్టర్ కరోనా చికిత్స పొందుతూ మరణించారు. యాదగిరి గుట్టకు చెందిన ఓ వ్యక్తి కరోనాతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. ఆస్పత్రి యాజమాన్యం 12 లక్షల రూపాయల బిల్లు వేశారని మృతుని కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
పెరుగుతున్న కేసులు
అబ్దూల్లాపూర్ మండలం కొత్తగూడడ్యామ్లో భార్య, భర్తలకు వైరస్ సోకింది. జీహెచ్ఎంసీ యూసుఫ్ గూడ సర్కిల్ -19 పరిధిలో ఇవాళ 42 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కూకట్‌పల్లిలో 28 కరోనా కేసులు నమోదయ్యాయి. మూసాపేట్ సర్కిల్లో17, కూకట్‌పల్లి సర్కిల్లో 11 కేసులు కొత్తగా వచ్చాయి.
ఇదీ చదవండి : బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాస్తే అందరూ నవ్వారు: కేటీఆర్