హైదరాబాద్ కూకట్‌పల్లి పరిధిలో నాలుగు వందలకు పైగా రజకులు ధోబిఘాట్‌ల వద్ద బట్టలు ఉతుకుతూ ఉపాధి పొందుతున్నారు. కేపీహెచ్బీ కాలనీ, హైదర్ నగర్, మూసాపేట్ ప్రాంతాలలో ధోబిఘాట్‌లు ఉన్నాయి. హాస్టల్, హోటల్, రెస్టారెంట్లు పూర్తిగా మూసివేయడంతో ఉపాధి కరవైందని రజకులు వాపోతున్నారు. పిల్లల ఫీజులు, బియ్యం, నిత్యావసరాలు, కరెంట్‌బిల్లులు ఇబ్బందిగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆకలి బతుకులు
దుస్తులు ఉతకడం, ఇస్త్రీ చేయడం తప్ప మరే పని తెలియక వారు ఇంటి వద్దే కాలం వెళ్లదీస్తున్నారు. నగరంలో ఉంటే ఖర్చులకు డబ్బులు లేవని సొంత గ్రామాలకు వెళ్లిపోదామనే ఆలోచనలో ఉన్నట్లు పలువురు తెలిపారు. కరోనా నిబంధనలను పాటిస్తూ దోబీ ఘాట్‌ల వద్ద బట్టలు శుభ్రం చేస్తున్నప్పటికీ ఎవరూ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరిలో కొందరు వేరే పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుందామనుకున్నా పని దొరకడం లేదంటున్నారు.
ఉపాధి కోల్పోయి రోడ్డుమీద పడేస్థితిలో ఉన్న రజకులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. జీవన భృతి కింద ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి : ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ స్ఫూర్తిగా నూతన సచివాలయం