కొవిడ్ నియంత్రణలో సీఎం కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం దురదృష్టకరమన్నారు. ప్రజలను పాలించడానికి ముఖ్యమంత్రి అయ్యారా లేక చంపడానికయ్యారా అని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో పది లక్షలకుపైగా కరోనా పరీక్షలు చేయగా ఇక్కడ కేవలం లక్ష పరీక్షలే ఎందుకు చేశారని నిలదీశారు. ఇది కేసీఆర్ సర్కారు వైఫల్యం కాదా అని ప్రశ్నించారు.
ఏపీ, దిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలను చూసైనా నేర్చుకోవాలని సూచించారు. కొవిడ్ పేరుతో వచ్చిన కోట్లాది రూపాయల విరాళాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రగతిభవన్‌లో కరోనా కేసులు రావడం వల్ల కేసీఆర్ ఫామ్ హౌస్‌కు వెళ్లారని ఆరోపించారు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రజల బాగోగులు పట్టించుకోవాలని, కరోనా పరీక్షలకు ఎక్కువ ఫీజులు తీసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: విదేశీ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా 'ఎలిమెంట్స్'