Congress Protest in Telangana: రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన నిర్వహించింది. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు నేతృత్వంలో హైదరాబాద్ గాంధీభవన్ వద్ద ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హైదరాబాద్ బషీర్ బాగ్ కూడలిలో నిజాం కాలేజ్ ముందు ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
మోదీ హటావో దేశ్ కి బచావో...
తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచేలా పార్లమెంట్ సాక్షిగా ప్రధాని అబద్ధాలు మాట్లాడారని ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు మండిపడ్డారు. మెదక్ జిల్లా నర్సాపూర్ చౌరస్తాలో నిర్వహించిన ఆందోళనల్లో ఆయన పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిజామాబాద్ రైల్వేస్టేషన్ చౌరస్తాలో నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. వరంగల్‌లోని పోచం మైదాన్ కూడలి వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మోదీ హఠావో దేశ్ బచావో అంటూ కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు.
అవమానించేటట్లు...
తెలంగాణ రాష్ట్ర ప్రజలను అవమానపరిచేట్లు దేశ ప్రధాని మోదీ పార్లమెంట్‌లో చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ తెలిపారు. చదువుకుని వారిని ప్రధానిగా చేస్తే ఫలితం ఇలాగే ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండడంతోనే ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి 2014 ముందు సెంటిమెంట్‌తో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. ప్రధాని మోదీ తెలంగాణ ఏర్పాటు విషయంలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలను తీవ్రంగా అవమానపరిచేట్లు ఉన్నాయని ధ్వజమెత్తారు.
కేసీఆర్, మోదీ నాటకాలు...
సీమాంధ్రలో పార్టీకి నష్టమని తెలిసినా... సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి గుర్తుచేశారు. విద్యార్థుల ప్రాణాలు కాపాడటం కోసమే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. తెలంగాణ బిల్లుపై ఓటింగ్ జరుగుతుంటే కేసీఆర్ సభలోనే లేరని అన్నారు. తెలంగాణ ఏర్పాటుపై అందరినీ ఒప్పించేందుకు కొంత సమయం పట్టిందన్న భట్టి... కావాలనే కేసీఆర్, మోదీ కలిసి నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్, సోనియాను విమర్శిస్తే ఊరుకునేది లేదని భట్టి హెచ్చరించారు. మోదీ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలిపిన కాంగ్రెస్ నేతలు...విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు.
ఇదీ చూడండి: