Chandrababu Kuppam Tour : నేటి నుంచి మూడు రోజులపాటు.. ఏపీలోని కుప్పంలో సాగే చంద్రబాబు పర్యటనపై, సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సభలు, ర్యాలీలు, రోడ్‌షోలకు అనుమతి లేదంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్-1 ప్రకారం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌కి నోటీసులిచ్చారు. తెలుగుదేశం నేతలు మాత్రం సభ నిర్వహించి తీరతామని తేల్చిచెబుతున్నారు. సభ నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఏం జరగబోతోందన్నది ఉత్కంఠగా మారింది.
మధ్యాహ్నం రెండున్నర గంటలకు చంద్రబాబు చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం పెద్దూరు చేరుకోనున్నారు. రాత్రి 8 గంటల వరకు శాంతిపురం మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించనున్నారు. రేపు కుప్పుం తెలుగుదేశం కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తారు. ఈ నెల 6న గూడుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో చంద్రబాబు పర్యటన సాగనుంది..
కుప్పం బయలుదేరిన చంద్రబాబు: ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ నుంచి కుప్పం పర్యటనకు బయలుదేరారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కుప్పంకు వెళ్తారు. మధ్యాహ్నం శాంతిపురం మండలం పెద్దూరు చేరుకోని, మండలంలోని పలు గ్రామాల్లో చంద్రబాబు ఈ రోజు పర్యటించనున్నారు. పర్యటన అనంతరం రాత్రికి కుప్పంలో బసచేస్తారు.
అనుమతి లేదంటున్న పోలీసులు: మరోవైపు పోలీసులు పోలీసులు చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదంటున్నారు. కుప్పం నుంచి వెళ్లాల్సిన ప్రచారం రథం, ఇతర వాహనాలను అడ్డుకున్నారు. కుప్పం నుంచి శాంతిపురానికి వెళ్తున్న చైతన్య రథాన్ని అడ్డుకున్న పోలీసులు శాంతిపురంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. చంద్రబాబు కోసం వస్తున్న కార్యకర్తలను వెనక్కి పంపిస్తున్నారు. చిత్తూరు జిల్లా 121 పెద్దూరు గ్రామం వద్ద పోలీసుల ఆంక్షలు విధించారు.
ఇవీ చదవండి: