CBI Files Counter on Sabitha Indrareddy : ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చుట్టూ సీబీఐ ఉచ్చు బిగిస్తోంది. తాజాగా ఓబుళాపురం గనుల లీజు కోసం అధికారులు పంపిన దస్త్రంపై సంతకం చేశానంతేనంటూ బాధ్యతలు తప్పించుకోలేరని సీబీఐ పేర్కొంది. మంత్రి రాజ్యాంగ బద్ధంగా నడుచుకోవాలి కానీ... అధికారులు చెప్పినట్లు కాదని తెలిపింది. ఓఎంసీ కేసు నుంచి సబితాను తొలగించవద్దని సీబీఐ హైకోర్టును కోరింది. ఈ మేరకు న్యాయస్థానంలో సీబీఐ కౌంటరు దాఖలు చేసింది.
అప్పటి గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి.. ఓఎంసీకి లబ్ధి చేకూరేలా వ్యవహరించారని సీబీఐ తెలిపింది. ఓఎంసీకి లీజులివ్వడం వల్ల తాను ఎలాంటి లబ్ధి పొందలేదన్న వాదన సరికాదని... తన పదవి ద్వారా ఇతరులకు ప్రయోజనాలకు కల్పించినా అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందని సీబీఐ వాదించింది. మొదట సాక్షిగా పేర్కొని.. తర్వాత కొత్త డాక్యుమెంట్లు, సాక్షులు లేకుండానే మూడో ఛార్జ్‌షీట్‌లో నిందితురాలిగా మార్చారన్న వాదన కూడా తప్పేనని.. తగిన ఆధారాలను కోర్టుకు సమర్పించామని సీబీఐ పేర్కొంది.
విచారణ మార్చి17వ తేదీకి వాయిదా : రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిర్ణయం వల్ల ప్రభుత్వానికి నామమాత్రం ఫీజు దక్కగా.. ఓఎంసీ లబ్ధి పొందిందని సీబీఐ వివరించింది. ఓఎంసీ కేసు నుంచి తొలగించాలన్న సబితా ఇంద్రారెడ్డి అభ్యర్థనను సీబీఐ న్యాయస్థానం తోసిపుచ్చడం సరైందేనని దర్యాప్తు సంస్థ పేర్కొంది. సీబీఐ చెబుతున్న సాక్షుల్లో ఎవరూ మంత్రికి వ్యతిరేకంగా చెప్పలేదని.. డాక్యుమెంట్లు కూడా సంబంధం లేనివని సబితా ఇంద్రారెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. సీబీఐ కౌంటరుపై పూర్తిస్థాయి వాదనలు వినిపిస్తామని సబితా తరఫు న్యాయవాది కోరడంతో విచారణను మార్చి17వ తేదీకి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ వాయిదా వేశారు.
ఇవీ చదవండి: