BRS MLA Ticket Issues Telangana 2023 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 6 నియోజకవర్గాల్లో నేతలు.. అసమ్మతితో రగిలిపోతున్నారు. పాలేరులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డికే టికెట్ ఇవ్వడంతో సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావుకే టికెట్ దక్కడంతో.. మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత జలగం వెంకట్రావు అసమ్మతి వ్యక్తం చేశారు. ఇల్లందులో తర్జన భర్జన తర్వాత ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌కే అధిష్ఠానం మళ్లీ అవకాశం ఇవ్వడాన్ని.. మున్సిపల్ ఛైర్మన్ వెంకటేశ్వర్లు వర్గీయులు, పలువురు కౌన్సిలర్లు వ్యతిరేకిస్తున్నారు. భద్రాచలంలో పార్టీని వీడి మళ్లీ చేరిన తెల్లం వెంకట్రావును అభ్యర్థిగా ప్రకటించడంపై అసంతృప్తితో ఉన్న మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ బుచ్చయ్య పోటీలో ఉంటానని తెలిపారు.
Telangana Assembly Elections 2023 : మధిరలో లింగాల కమలరాజ్కే మరోసారి అవకాశం ఇవ్వడంతో ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న బొమ్మెర రామ్మూర్తి అన్యాయం జరిగిందని ఏకంగా ధర్నాకే దిగారు. వైరాలో మదన్‌లాల‌్‌కు అవకాశం ఇవ్వటంతో ఎమ్మెల్యే రాములునాయక్ అసంతృప్తితో ఉన్నారు. అధిష్ఠానం అన్యాయం చేసిందని అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నకిరేకల్‌లో కాంగ్రెస్ నుంచి వచ్చిన చిరుమర్తి లింగయ్యకే టికెట్ ఇవ్వడంతో.. మాజీ ఎమ్మెల్యే నోముల వీరేశం పార్టీకి రాజీనామా ప్రకటించారు. కోదాడ రాజకీయం రచ్చకెక్కింది. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు నియోజకవర్గంలోని సీనియర్ల నుంచి వ్యతిరేకత ఎదురైంది. సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డిపై.. డీసీఎంఎస్ ఛైర్మన్ జానయ్య యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మంత్రికి వ్యతిరేకంగా మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం చేస్తున్నారు. నల్గొండలో కంచర్ల భూపాల్‌రెడ్డిపై.. పట్టణ మాజీ అధ్యక్షుడు రామరాజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటున్నారు. దేవరకొండలో రవీంద్రనాయక్‌పై.. మున్సిపల్ ఛైర్మన్ ఆలంపల్లి నరసింహా, మాజీ ఛైర్మన్ దేవేంద్ర నాయక్ వర్గీయులు భగ్గుమంటున్నారు. నాగార్జునసాగర్‌లో నోముల భగత్‌ను మార్చాలంటూ పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలు సమావేశమయ్యారు. వారి వెనక ఎమ్మెల్సీ కోటిరెడ్డి ఉన్నారని ప్రచారం సాగుతోంది.
- BRS MLAs Final Candidates List 2023 : బీఆర్ఎస్ గెలుపు గుర్రాలివే.. తొలి జాబితా ప్రకటించిన కేసీఆర్!
MLA Ticket Clashes in BRS Party : ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామలో కొన్నిరోజులుగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి భగ్గుమంటోంది. పల్లాకే అవకాశం ఇవ్వనున్నారని ప్రచారం సాగడంతో.. ముత్తిరెడ్డి వర్గీయులతో బహిరంగంగానే సమావేశాలు నిర్వహిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రచారం ప్రారంభించారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరిని అభ్యర్థిగా ప్రకటించినా.. ఎమ్మెల్యే రాజయ్య ఎప్పటికీ ప్రజా జీవితంలో ఉంటానంటున్నారు. మహబూబాబాద్‌లో ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ను మార్చాలని ఎమ్మెల్సీ తక్కెళ్ల రవీందర్ రావు వర్గీయులు సమావేశమై తీర్మానించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ అసమ్మతి బుసలు కక్కుతోంది. వేములవాడలో తనను కాదని చల్మెడ లక్ష్మీనరసింహారావుకు టికెట్ ఇవ్వడంపై ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ అసంతృప్తితో ఉన్నారు. అసంతృప్తిని చల్లార్చేందుకు వ్యవసాయరంగం సలహాదారుడిగా.. కేసీఆర్ నియమించారు. రామగుండంలో టికెట్ల కేటాయింపునకు ముందే అసమ్మతి భగ్గుమంది. మంథనిలో పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్టా మధుకు టికెట్ ఇవ్వడంపై ద్వితీయశ్రేణి కేడర్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
BRS MLA Ticket Issues in Telangana : పెద్దపల్లిలో దాసరి మనోహర్‌రెడ్డికి ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తంచేసిన.. నల్ల మనోహర్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు అప్పటికే పార్టీని వీడారు. కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్ మళ్లీ పోటీ చేయనుండగా.. మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ బీఆర్ఎస్కు రాజీనామా ప్రకటించడంతో పాటు స్వతంత్రంగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్‌లో అసమ్మతి భగ్గుమంది. భూక్యా జాన్సన్ నాయక్‌కు టికెట్ ఇవ్వడంతో.. రేఖానాయక్ తిరుగుబాటు లేవనెత్తారు. టికెట్ కోసం కాంగ్రెస్‌కు దరఖాస్తు చేసుకోగా.. ఆమె భర్త శ్యామ్‌నాయక్ హస్తం పార్టీలో చేరారు. మంచిర్యాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్‌రావుకు మళ్లీ టికెట్ ఇవ్వడంపై.. మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు.
బోధ్‌లో అనిల్‌జాదవ్‌కు ఇవ్వగా.. ఎమ్మెల్యే రాథోడ్ బాబూరావు, మాజీ ఎంపీ నగేశ్ అలక వహించారు. నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అభ్యర్థిత్వంపై బీఆర్ఎస్ రాష్ట్రకార్యదర్శి సత్యనారాయణ్‌గౌడ్ తదితరులు అసంతృప్తితో ఉన్నారు.ముథోల్‌లో టికెట్ ఆశించిన మాజీ మంత్రి వేణుగోపాలచారి వర్గానికి నిరాశ ఎదురైందంటున్నారు.
BRS MLA Ticket Clashes in Medak District : మెదక్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డికి టికెట్ ఇవ్వగా.. తన కుమారుడు రోహిత్‌ను పక్కన పెట్టారని మైనంపల్లి హన్మంతరావు నిరసన వ‌్యక్తం చేశారు. మంత్రి హరీశ్‌రావుపై మైనంపల్లి వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నర్సాపూర్‌లో టికెట్ కోసం ఎమ్మెల్యే మదన్ రెడ్డికి.. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీతాలక్ష్మారెడ్డికి మధ్య పోటీ నెలకొంది.
గ్రేటర్ హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో బండారు రాజిరెడ్డికి కేటాయించడంపై.. ఎమ్మెల్యే భేతిసుభాష్ రెడ్డి, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గుర్రుగా ఉన్నారు. మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డిపై కొంతకాలంగా బహిరంగంగా విరుచుకుపడుతున్న.. మలిపెద్ది సుధీర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. తాండూరులో మహేందర్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వగా అక్కడ అసమ్మతి చల్లారింది. అంబర్‌పేట, ముషీరాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో కొందరు నేతలు అలక వహించి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.