ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బ్రహ్మంగారిమఠం(Brahmamgari Matam)లో రెండు కుటుంబాల మధ్య నెలకొన్న పీఠాధిపత్య సమస్య పరిష్కారానికి... అక్కడ పర్యటించిన తెలుగు రాష్ట్రాల 20 మంది మఠాధిపతులు ఓ అభిప్రాయానికి వచ్చారు. విశ్వధర్మ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు శివస్వామి ఆధ్వర్యంలో స్థానిక పరిస్థితులను తెలుసుకున్న అనంతరం... దివంగత పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి మొదటి భార్య కుమారుడు వెంకటాద్రిస్వామికే పీఠం దక్కుతుందన్నారు. గ్రామస్థుల్లోనూ ఎక్కువ మంది వెంకటాద్రి స్వామివైపే ఉన్నారని... మఠాధిపతుల అభిప్రాయాలను ప్రభుత్వానికి రెండు రోజుల్లో నివేదిక రూపంలో అందిస్తామని తెలిపారు. వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి రెండో భార్య మారుతీ మహాలక్ష్మమ్మ చెబుతున్నట్లుగా వీలునామా చెల్లదని శివస్వామి స్పష్టంచేశారు.
కాలజ్ఞానకర్త జీవసమాధి పొందిన బ్రహ్మంగారిమఠాన్ని అపవిత్రం చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని శివస్వామి అన్నారు. మఠంలో జరిగిన అవినీతి, అక్రమాలపైనా ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. దివంగత పీఠాధిపతి వసంత వెంకటేశ్వరస్వామి మరణంపై అనుమానాలు ఉన్నాయని... తమ దగ్గర ఉన్న ఆధారాలను పోలీసులకు అందజేస్తామని శివస్వామి తెలిపారు.
మఠాధిపతుల పర్యటన సమయంలోనే బ్రహ్మంగారిమఠం సమస్యపై విజయవాడలో ఉన్నతాధికారులతో దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్(Minister Vellampalli Srinivas) చర్చించారు. దీనిపై కమిటీ వేసి నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. వీలునామా ఉంటే 90 రోజుల్లో ధార్మిక పరిషత్‌కు అందజేయాలని... ఇప్పటిదాకా ఎలాంటి వీలునామా అందలేదని చెప్పారు. మారుతీ మహాలక్ష్మి డీజీపీ(DGP)కి లేఖ రాసిన దగ్గర నుంచి మఠం దగ్గర పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.
ఇదీ చదవండి: టీకా వేసుకోరా? అయితే ఫోన్ బ్లాక్, జీతం కట్!