ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్యగౌడ్ విమర్శలు గుప్పించారు. బీసీలను కల్వకుంట్ల ప్రభుత్వం ఆర్థికంగా, రాజకీయంగా, విద్య పరంగా అణగదొక్కుతున్నారని ఆరోపించారు. కేసిఆర్‌వి ఆత్మీయ సభలు కాదని.. ఆత్మవంచన సభలని విమర్శించారు. బీసీలు ఎన్ని జన్మలు ఎత్తినా కల్వకుంట్ల రాష్ట్ర సమితిలో సీఎంలు అవ్వరని.. పదవులు రావని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పల్లె పల్లెకు ఓబీసీ ఇంటింటికి బీజేపీ కార్యక్రమం ద్వారా ప్రతి గడపను టచ్ చేస్తామని బూర నర్సయ్యగౌడ్ వెల్లడించారు. బీసీల మీద జరుగుతున్న దాడులను ప్రతి ఇంటికి వివరిస్తామని పేర్కొన్నారు. ఏప్రిల్ 6 నుంచి 14 తేదీ వరకు బీసీలను చైతన్య పరిచే కార్యక్రమాలు ప్రారంభిస్తామని వివరించారు. పేపర్ లీకేజీలో కేటీఆర్ ఇద్దరు వ్యక్తుల ప్రమేయం మాత్రమే ఉందన్నారని.. ఇప్పుడేమో సిట్ 50మందికి నోటీసులిచ్చిందని విమర్శించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపకపోతే ప్రగతిభవన్ వైపు అనుమానాలు కలుగుతాయని చెప్పారు. సిట్ అంటేనే కేసీఆర్ కిట్‌గా వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్‌లో ఏకాభిప్రాయం కోసమే పెండింగ్‌లో ఉందని బూర నర్సయ్య గౌడ్ అన్నారు.
"కల్వకుంట్ల ప్రభుత్వం బీసీలను ఆర్థిక,రాజకీయ, విద్యాపరంగా అణగదొక్కుతోంది. బీసీలు ఎన్ని జన్మలెత్తినా కల్వకుంట్ల రాష్ట్ర సమితిలో సీఎంలు కాలేరు. పల్లె పల్లెకు ఓబీసీ ఇంటింటికి బీజేపీ కార్యక్రమం ద్వారా ప్రతి గడపను టచ్ చేస్తాం. బీసీల మీద జరుగుతున్న దాడులను ప్రతి ఇంటికి వివరిస్తాం. పేపర్ లీకేజీలో కేటీఆర్ ఇద్దరు వ్యక్తుల ప్రమేయం మాత్రమే ఉందన్నారు. ఇప్పుడేమో సిట్ 50మందికి నోటీసులిచ్చారు." - బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎంపీ, బీజేపీ నేత
మరోవైపు టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీని నిరసిస్తూ మార్చి 25న ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. ప్రశ్నించే వారిపై, యూట్యూబ్ ఛానల్స్‌పై ప్రైవేటు వ్యక్తులతో దాడులు చేయించి.. ఈ ప్రభుత్వం భయానక వాతావరణాన్ని సృష్టిస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. అయితే ఈ పేపర్ లీకేజీ, మీడియాపై దాడులు, జర్నలిస్టుల అరెస్టుల అంశాలపై పార్టీ నేతలతో చర్చించి.. అందుకు అనుగుణంగా నడుచుకుంటామని పేర్కొన్నారు. తీన్మార్ మల్లన్న అరెస్టును ఖండిస్తూ.. తనకు బెయిల్ ఇప్పించేందుకు బీజేపీ లీగల్ సెల్ కృషి చేయాలని ఆదేశించారు.
ఈ క్రమంలోనే సిట్ అందించిన నోటీసులు తనకు అందలేదని బండి సంజయ్ తెలిపారు. ఏ ఇంటికి అధికారులు నోటీసులు అంటించారో.. తను ఇంటికి వెళ్లేసరికి చిరిగిపోయిన కాగితం ఉందని వివరించారు. సిట్ అధికారులు నోటీసులు తనకు కాకుండా సీఎం కేసీఆర్.. ఐటీ మంత్రి కేటీఆర్‌కు ఇవ్వాలని సూచించారు.
ఇవీ చదవండి: ఎకరానికి రూ.10 వేల పరిహారం: సీఎం కేసీఆర్
రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష.. ఆరేళ్లు అనర్హత వేటు ఖాయమా?