ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ వరకు ఆర్నెళ్ల కాలం పూర్తైంది. ఈ ఆర్నెళ్లలో ఆదాయాలు తీవ్రంగా పడిపోయిన వేళ... ఆర్థిక శాఖ రాష్ట్ర వార్షిక బడ్జెట్ మధ్యంతర సమీక్షకు సిద్ధమైంది. కాగ్ నివేదిక ప్రకారం సెప్టెంబర్ నెలాఖరు వరకు రాష్ట్రానికి రూ. 37, 949 కోట్ల రెవెన్యూ వచ్చింది. 2020-21 ఆర్థికసంవత్సరానికి రెవెన్యూ అంచనా రూ. లక్షా 43వేల కోట్లు కాగా... ఆర్నెళ్లు పూర్తయ్యే నాటికి రూ. 37, 949 కోట్లు వచ్చాయి. రెవెన్యూ అంచనాల్లో ఇది 26.51 శాతం.
రూ. 31 వేలకోట్ల ఆదాయం...
గత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ వరకు 39.18 శాతం రెవెన్యూ వచ్చింది. పన్నుల ఆదాయం లక్ష్యం... రూ. లక్షా రెండు వేల కోట్లు కాగా సెప్టెంబర్ వరకు కేవలం రూ. 31,758 కోట్లు మాత్రమే వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ వరకు రూ. 38, 774 కోట్లు పన్నుల ద్వారా సమకూరాయి. పన్నుల ద్వారా సర్కార్ ఖజానాకు ఈ ఏడాది ఏప్రిల్‌లో కేవలం రూ. 1,700 కోట్లు మాత్రమే వచ్చాయి. మే నెలలో రూ. 3, 682, జూన్‌లో రూ. 6, 510, జూలైలో రూ. 6, 588, ఆగస్టులో రూ. 6,677 కోట్లు రాగా సెప్టెంబర్ నెలలో రూ. 6, 599 కోట్లు సమకూరాయి.
ఎక్సైజ్‌లో అత్యధికంగా...
పన్ను ఆదాయంలో జీఎస్టీ వాటా రూ. 10,437 కోట్లు కాగా... స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 1,657, అమ్మకం పన్ను రూపంలో రూ. 8,148 కోట్లు వచ్చాయి. ఎక్సైజ్ ఆదాయం రూ. 6,285 కోట్లు కాగా... కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా రూ. 3,753 కోట్లు. ఇతర పన్నుల రూపంలో రూ. 1, 475 కోట్లు, పన్నేతర ఆదాయం ద్వారా రూ. 1,542 కోట్లు, గ్రాంట్ల రూపంలో రూ. 4, 649 కోట్లు సమకూరాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా అత్యల్పంగా కేవలం 16.57 శాతం మాత్రమే రెవెన్యూ రాగా ఎక్సైజ్‌లో అత్యధికంగా 39.29 శాతం ఆదాయం వచ్చింది.
భారీగా పడిపోయిన ఆదాయం...
క్యాపిటల్ ఆదాయంలో రూ. 25,989 కోట్లను ప్రభుత్వం అప్పుల ద్వారా సమకూర్చుకొంది. అప్పుల అంచనాల్లో ఇది 78.3 శాతం. గత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ నెలాఖరు వరకు తీసుకున్న అప్పులు రూ. 14,704కోట్లు. లాక్డౌన్ కారణంగా ఆదాయం భారీగా పడిపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అప్పులపై ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ నెలాఖరు వరకు ప్రభుత్వం చేసిన వ్యయం రూ. 60,786 కోట్లు. జనరల్ సెక్టార్‌పై రూ. 14,728 కోట్లు, సామాజిక రంగంపై రూ. 22,579 కోట్లు ఖర్చు చేయగా... ఆర్థికరంగంలో రూ. 23,473 కోట్ల వ్యయాన్ని చేసింది.
బడ్జెట్ మధ్యంతర సమీక్ష...
తాజా పరిణామాల నేపథ్యంలో బడ్జెట్ మధ్యంతర సమీక్ష ప్రక్రియ కొనసాగుతోంది. కరోనా నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు భారీగా తగ్గినందున... బడ్జెట్‌పై మధ్యంతర సమీక్ష నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఇప్పటి వరకు వచ్చిన ఆదాయం, చేయాల్సిన వ్యయం తదితరాలను దృష్టిలో ఉంచుకొని మొత్తం బడ్జెట్‌పై సమీక్ష నిర్వహించి నివేదిక ఇచ్చేందుకు ఆర్థికశాఖ కసరత్తు చేస్తోంది.
ఇదీ చదవండి: సచివాలయ నిర్మాణ పనులు దక్కించుకున్న షాపూర్జీ పల్లోంజీ సంస్థ