BJP Leaders Fires on KCR: పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకల రద్దు అప్రజాస్వామికమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గవర్నర్ రాజ్యంగ విధులకు కేసీఆర్ ఆటంకం కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు. గవర్నర్‌నే గౌరవించని కేసీఆర్ మహిళలకు ఎలా పెద్దపీట వేస్తారని మండిపడ్డారు. గణతంత్ర వేడుకలకు మాత్రమే కరోనా నిబంధనలా? సీఎం, మంత్రుల సభలకు కరోనా నిబంధనలు వర్తించవా అని ప్రశ్నించారు.
BJP Leaders on Cancellation of Republic Celebrations: బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే కొనసాగుతాయని లీక్ చేయడం కేసీఆర్ రాచరిక పోకడలకు నిదర్శనమని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. కేసీఆర్, బీజేపీ ఎమ్మెల్యేలను బీఏసీ సమావేశానికి పిలవకుండా నియంతృత్వంగా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. శామీర్‌పేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ వ్యవహారిస్తున్న తీరుపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును డబ్బుతో కొంటున్నారు: పార్టీల మధ్య ఇనుపగొడలు కట్టారని, ఇతర పార్టీల నేతల మధ్య స్నేహ పూరిత వాతావరణం లేకుండా చేశారని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రక్రియను డబ్బుతో ముడిపెట్టి అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును డబ్బుతో కొంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ లక్షల కోట్లు అక్రమంగా సంపాదించారన్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో ఉన్న భూములను అక్రమించుకుని అమ్ముకుని నార్త్, ఈస్ట్ రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నారని విమర్శించారు.
చిల్లర రాజకీయాన్ని దేశానికి రుద్దడమే బీఆర్ఎస్ పార్టీగా పేర్కొన్నారు. గవర్నర్‌ను పిలిచే సంప్రదాయం తెలియదు కానీ సచివాలయం ప్రారంభానికి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎల్లమ్మబండతోపాటు హైదరాబాద్ నగరంలో గుంజుకున్న భూములపై కేసీఆర్‌కు దమ్ముంటే సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతుందని నిరూపిస్తే, ముక్కు నేలకు రాస్తానని ఆయన సవాల్ విసిరారు. ఏ పార్టీలో లేని చేరికల కమిటీ బీజేపీలో ఉందని ఆయన తెలిపారు. హామీ ఇవ్వకుండా ఎవరైనా పార్టీలో చేరుతారా? వచ్చేవారికి హామీ ఇస్తే పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని స్పష్టం చేశారు. కొత్త చేరికలపై కమిటీలో చర్చిస్తున్నప్పుడే బయటకు తెలుస్తోందన్నారు.
అసలేం జరిగింది: రాష్ట్రంలో గణతంత్ర వేడుకలు జరపకపోవడాన్ని గవర్నర్ తమిళిసై కేంద్రం దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. కొవిడ్ కారణంగా నిరుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌లోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వేడుకల నిర్వహణ విషయమై అప్పట్లో రాజ్‌భవన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం జరిగింది. గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టిన గవర్నర్.. ప్రసంగం కూడా పంపలేదని పేర్కొన్నారు.
అయితే కొవిడ్ ఉద్ధృతి కారణంగా రాజ్‌భవన్‌లోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలకు సీఎం, మంత్రులు హాజరు కాలేదు. సమతామూర్తి విగ్రహావిష్కరణ సందర్భంగా రాష్ట్రపతిని స్వాగతించేందుకు విమానాశ్రయానికి ఇద్దరూ వచ్చినా దూరంగానే ఉన్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ జెండాను ఆవిష్కరించే సమయంలో సీఎం కేసీఆర్ ఉండాలి.
కానీ వేడుకలకు సీఎం హాజరుకాలేదు. గవర్నర్ ఒక్కరే జెండా ఆవిష్కరణ చేశారు. ఇక ఈసారి ఏకంగా వేడుకలను రాజ్‌భవన్‌లోనే జరపాలని లేఖ పంపడంతో గవర్నర్ అసహనం వ్యక్తం చేశారు. ఇదంతా చూస్తుంటే తెలంగాణలో రోజురోజుకు గవర్నర్, సీఎంల మధ్య దూరం పెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది.
ఇవీ చదవండి: