BJP On Jubilee Hills Gang Rape Case: జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో నిందితులను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని భాజపా రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు తరుణ్‌చుగ్ ఆరోపించారు. ప్రభుత్వ కారులో దారుణం జరిగితే... ఆ వాహనం ఎవరిదో ఎందుకు చెప్పరని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి ప్రజలు భయాందోళనకు గురవుతున్నా.. ముఖ్యమంత్రి వ్యవసాయ క్షేత్రానికి పరిమితమయ్యారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత కారణంగానే నేరాలు పెరుగుతున్నాయన్న తరుణ్‌చుగ్.. జూబ్లీహిల్స్ కేసును కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరిపించాల్సిన అవసరముందన్నారు.
ముఖ్యమంత్రి వ్యవసాయ క్షేత్రంలో ఉంటారు. సీఎం కుమారుడు ట్విటర్‌లో ఉంటారు. హోంమంత్రి సెలవులో ఉంటారు. శాంతి భద్రతల పరిరక్షణలో, పరిపాలనలో కేసీఆర్ ప్రభుత్వం అన్ని రకాలుగా వైఫల్యం చెందింది. జూబ్లీహిల్స్ ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలని భాజపా డిమాండ్ చేస్తోంది. ముఖ్యమంత్రిని నేను కోరేది ఏమంటే.... మీకు ఎలాగూ సమయం లేదు. అత్యాచార ఘటనలో నిందితులను కాపాడే కుట్రలో మీ పోలీసులు భాగస్వాములయ్యారు. నేరస్థులకు అండగా నిలిచారు. బాధితురాలికి న్యాయం జరగాలంటే ఈ కేసును ఎన్‌ఐఏ, సీబీఐతో దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉంది. -తరుణ్ చుగ్, భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్
బాలికపై అత్యాచార ఘటనను భాజపా ఆధారాలతో బయటపెట్టే వరకు పోలీసులు స్పందించలేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే.. ప్రభుత్వం ఉందా.. లేదా అన్న సందేహం నెలకొందన్నారు. పోలీసుల తీరుతో రాష్ట్రంలో రౌడీలు రెచ్చిపోయే ప్రమాదం ఉందని బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు.
'జూబ్లీహిల్స్ ఘటనపై భాజపా ఆందోళన చేసిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు స్పందించారు. ఓ వైపు శాంతి భద్రతలు క్షీణిస్తుంటే ముఖ్యమంత్రి మాత్రం స్పందించడం లేదు. ప్రతి రోజూ ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులను కాపాడటానికే పోలీసులు పనిచేస్తున్నారు. తెరాస, ఎంఐఎం అండగా ఉంటే తమను ఎవరూ ఏమీ చేయలేరని నేరాలు పాల్పడుతున్నారు. ఘటనపై ముఖ్యమంత్రి స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం.' -బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
జూబ్లీహిల్స్‌లో మైనర్‌పై అత్యాచార ఘటనపై భాజపా లీగల్ సెల్ ఆధ్వర్యంలో హైకోర్టు వద్ద న్యాయవాదులు నిరసన తెలిపారు. రాష్ట్రంలో లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని.. చిన్నారులు, మహిళలకు రక్షణ కరవైందన్నారు. అత్యాచారం ఘటన దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: 'ఆడబిడ్డకు అన్యాయం జరిగితే.. మహిళా మంత్రులు స్పందించరా?'
జూబ్లీహిల్స్ రేప్ కేసుపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
విమానాల్లో మాస్కు తప్పనిసరి.. లేదంటే బోర్డింగ్ పాయింట్లోనే..